-->

చరిత్రలో స్వర్ణయుగ రాజ్యం - గుప్తులు - Why is the Gupta Empire called the golden age in India?

Also Readమౌర్య సామ్రాజ్య పతనానంతరం దాని శిథిలాలపై ఎన్నో చిన్న, పెద్ద రాజ్యాలు ఆవిర్భవించాయి. మగధ మహాసామ్రాజ్యంపై మౌర్యుల స్థాయిలో ఏకమొత్తంగా ఎవరూ పట్టు సాధించలేకపోయారు. మౌర్యు ల ఆఖరి రాజైన బృహద్రధుడిని వధించి పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశాన్ని స్థాపించాడు. కేవలం మౌర్య సామ్రాజ్య తూర్పుభాగంపై మాత్రమే శుంగవంశం అజమాయిషీ చెలాయించగలిగింది. చివరి శుంగరాజైన దేవాభూతిని అతని మంత్రి వాసుదేవ కణ్వుడు క్రీ.పూ. 75లో వధించి కణ్వ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఇదే సమయంలో కళింగ(ఒరిస్సా)ను కేంద్రంగా చేసుకొని చేదివంశం పాలన ప్రారంభ మైంది. ఈ వంశంలో మూడోరాజైన ఖారవేలుడు అత్యంత ప్రసి ద్ధుడు. భువనేశ్వర్కు సమీపంలోని ఉదయగిరి కొండ గుహల్లోని హథిగుంఫా శాసనం ఖారవేలుడి గొప్పతనాన్ని, విజయాలను చెబు తోంది. జైన మతాభిమాని అయిన ఖారవేలుడు కుమారగిరిపైన జైనపరిషత్ను ఏర్పాటు చేశాడు. ఖారవేలుడి అనంతరం చేది వంశ చరిత్ర సమాప్తమైంది. మరోవంక బాక్ట్రియా నుంచి వచ్చి భారత వాయవ్య ప్రాంతాల్లో సామ్రాజ్య స్థాపన చేసినవారు ఇండో గ్రీకులు. వీరిలో అత్యంత ప్రసిద్ధుడు మినాండర్. ఈయననే బౌద్ధ గ్రంథాల్లో ‘మిళిందుడు' అని వ్యవహరించారు. పాళీభాషలోని 'మిళిందపన' (మినాండర్ ప్రశ్నలకు- బౌద్ధ గురువు నాగసేనుడి జవాబులు ఉన్న గ్రంథం) ఈయన గురించి వివరిస్తోంది. క్రీ.పూ. 50లో శకుల చేతిలో ఓడిపోవడంతో ఇండోగ్రీకుల కథ ముగిసింది. శకులలో మొదటి రాజు మావుస్. తక్షశిల రాజధానిగా ఈయన పాలన సాగించాడు. ఇతనికి 'రాజాధి రాజు' అనే బిరుదు ఉంది. శకుల అనంతరం పార్థియన్లు (పహ్లవులు) పాలించారు. ఈ మధ్యకాలంలో అత్యంత కీలకమైన ఘట్టం కుషాణుల పాలన. వీరిలో అగ్రగణ్యుడు కనిష్కుడు. క్రీ.శ.78న సింహాసనాన్ని అధిష్టించి 'శఖ' యుగాన్ని ఆరంభించాడు. పురుష పురం రాజధానిగా కనిష్కుడి పాలన సాగింది. అశ్వఘోషుడి ప్రోత్సా హంతో బౌద్ధమతాన్ని స్వీకరించి 'నాలుగో బౌద్ధ సంగీతి’ని నిర్వహిం చాడు. ఇందులోనే బౌద్ధమతం హీనయాన, మహాయాన అనే రెండు శాఖలుగా చీలిపోయింది. కార్ధమాక రాజులు కుషాణుల సమకాలి కులు. వీరిలో అగ్రగణ్యుడు చస్తమనుడి మనుమడైన రుద్రదాముడు. గిర్నార్ శాసనంలో రుద్రదాముడి గురించి వర్ణించారు. సౌరాష్ట్రలో మౌర్యులు నిర్మించిన సుదర్శన తటాకాన్ని బాగుచేయించిన రాజు ఇతడు. మూడో రుద్రసింహుడిని క్రీ.శ. 388లో గుప్తురాజైన రెండో చంద్రగుప్తుడు వధించడంతో కార్ధమాక వంశం కథ ముగిసింది.

గుప్త యుగం

గుప్తుల గురించి మనకు తెలియచెబుతున్న చారిత్రక ఆధారాలకు కొదవ లేదు. గ్రంథ, పురావస్తు ఆధారాలు గుప్తుల గురించి చెప్పు కోదగిన సమాచారాన్నే అందిస్తున్నాయి. ధర్మశాస్త్రాలు, స్మృతుల ఆధారంగా గుప్తుల కాలంనాటి న్యాయవ్యవస్థ తీరుతెన్నులను -కాళిదాసు, విశాఖదత్తుడు, విజ్ఞేశ్వరుడు, కమందకుడు వంటివారు రచించిన గ్రంథాల ఆధారంగా అప్పటి సామాజిక వ్యవస్థలోని సంక్లిష్ట తలను తెలుసుకోవచ్చు. ఇక గుప్తుల నాణేలు, వారు వేసిన శాసనాలు చరిత్రకారులకు అమితంగా ఉపయోగపడుతున్నాయి. మరీ ముఖ్యం గా రెండో చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు వేయించిన మెహ్రకాళీ స్తంభ శాసనం, హరిసేనుడు రచించిన 'అలహాబాద్ ప్రశస్థి' గుప్తుల గురించి విపులంగా తెలియజేస్తున్నాయి.

గుప్తులు ఏ ప్రాంతానికి చెందినవారన్న అంశంపై ఏకాభిప్రాయం లేకున్నా-బెంగాల్లో కుషాణుల సామంతులుగా వీరి రాజకీయ చరిత్ర ప్రారంభమైందని తెలుస్తోంది. గుప్తుల చరిత్రలో శ్రీగుప్తుడిని తొలి పాలకుడిగా పరిగణిస్తారు. ఆయన అనంతరం 'రాజాధిరాజ' బిరు దుతో ఘటోత్కచ గుప్తుడు పాలించాడు. గుప్తుల పాలన ప్రత్యేకతను సంతరించుకొని, స్వతంత్ర రాజవంశంగా అధికారంలోకి రావడం మాత్రం క్రీ.శ. 320లో మొదటి చంద్రగుప్తుడితోనే ప్రారంభమైంది. మగధ రాజ్యంలో అత్యంత బలమైన లిచ్చవీల రాజకుమార్తె కుమార దేవిని వివాహం చేసుకోవడంతో పాటలీపుత్రం గుప్తుల ఏలుబడిలోకి వెళ్లింది. జ్యేష్ట వారసత్వానికి వ్యతిరేకంగా మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడిని చక్రవర్తిగా నియమించాడు. దండయాత్రల ద్వారా సముద్రగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని దేశం నలుమూలలా విస్తరింప చేశాడు. ఆర్యావర్త దండయాత్ర ద్వారా మధ్య భారతదేశాన్ని, దక్షిణాన 12 మంది రాజులను జయించడం ద్వారా దక్షిణాదిని సముద్రగుప్తుడు తన అజమాయిషీలోకి తెచ్చుకున్నాడని అందుబాటు లోని ఆధారాలు తెలుపుతున్నాయి. ఈయన తదనంతరం పాలన పగ్గాల చేపట్టిన రెండో చంద్రగుప్తుడు శకులపై చిరస్మరణీయ విజయాన్ని సాధించి 'శకారి' అన్న బిరుదును పొందాడు. రెండో చంద్రగుప్తుడి కొలువులో 'నవరత్నాలు'గా పేరుగాంచిన మేధావులు కొలువు దీరినట్లు తెలుస్తోంది. రెండో చంద్రగుప్తుడి అనంతరం కుమారగుప్తుడి హయాంలో గుప్తుల ప్రాభవం కొడిగట్టడం ప్రారం భమై, స్కంధగుప్తుడితో పతాన వస్థకు చేరింది. తెల్లహూణుల దండ యాత్రలు గుప్తుల సామ్రాజ్యానికి తూట్లు పొడిచాయి.

పాలన-సమాజం

రాజ్యానికి రాజు సర్వాధికారి. దైనందిన పాలనలో ఆయనకు తోడ్ప డేందుకు మంత్రి పరిషత్తు ఉండేది. పాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని భుక్తులుగా, విషయాలుగా, మండలాలుగా విభజించారు. గ్రామం చివరి పాలన విభాగం. భూమిశిస్తు రాజ్యానికి ప్రధానాదాయం. పండిన పంటలో సాధారణంగా 1/6 వంతును శిస్తుగా వసూలు చేసేవారు. సైనిక, గూఢచార వ్యవస్థలు అత్యంత పటిష్టంగా ఉండేవి.

గుప్తుల కాలంనాటికి సమాజంలో వర్ణవ్యవస్థ బలంగా వేళ్లూను కొంది. మనుధర్మ శాస్త్రం ఆధారంగా న్యాయవ్యవస్థ కొనసాగింది. కింది కులాలలో పలు ఉపకులాలు పుట్టుకొచ్చాయి. విజ్ఞాన, గణిత, ఖగోళ, జోతిష శాస్త్రాలకు గుప్తులు పెద్దపీట వేశారు. దశాంశ పద్ధతి వినియోగంలో ఉండేది. నలంద విశ్వవిద్యాలయం ప్రధానకేంద్రంగా ఉండేది. హుయాన్ఆత్సాంగ్, ఇత్సింగ్ వంటి వారు సైతం ఇక్కడ కొంత కాలం పాటు ఉండి విజ్ఞాన సముపార్జన చేసినట్లు తెలుస్తోంది. శ్రేణుల నేతృత్వంలో వాణిజ్యం జోరుగా సాగింది. ఖనిజ పరిశ్రమ ప్రాచుర్యం పొందింది. వస్త్ర పరిశ్రమ కళ్లు చెదిరే స్థాయిలో అభివృద్ధి చెందింది. వీరి కాలాన్ని స్వర్ణయుగంగా కీర్తించటంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆర్థిక అసమానతలు తీవ్రం కావటం, వర్ణ వివక్ష వేయితల లతో విస్తరించటం వంటివి ప్రతికూలతలు. అయితే వాస్తు, కళా, సారస్వత రంగాల్లో సాధించిన ప్రగతి గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని కొనియాడదగ్గ స్థాయిలో ఉంది.

Close