-->

ఎలాంటి షేర్ పైనా మమకారం వద్దు - There is no profit on any share - Stock market

Also Readషేర్ల ధరలు పైపైకి వెళుతుంటే ఇన్వెస్టర్ల ఉత్సాహానికి అడ్డూ అదుపూ ఉండదు. అవి ఇంకా ఎంతపైకి వెళుతున్నాయో అని ఆలోచిస్తారు. ఉదాహరణకు సాఫ్ట్వేర్ బూమ్ ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ ఒక్కో షేర్ పదివేలు దాటినా చాలా మంది ఇన్వెస్టర్లు అమ్ముకోలేదు. అది ఇరవై వేలు దాటుతుందని లెక్కలు కట్టి మరీ కలల్లో మునిగిపోయారు. అలాగే విజువల్ సాఫ్ట్వేర్ షేర్ ఒక్కొక్కటి ఎనిమిది వేలు దాటినా ఇంకా ఆకాశంలోకి లెక్కలు వేస్తూనే ఉన్నారు. కాని తమ పెట్టుబడికి ఎన్నో రేట్లు పెరిగిపోయింది కదా, ఇక అమ్ముకుందామన్న కామన్ సెన్స్ ఎవరికీ రాలేదు. ఫలితంగా సాఫ్ట్వేర్ బుడగ పగిలిపోవడంతో ప్రస్తుతం ఇన్ఫోసిస్ రేటు పడిపోయింది.

కాబట్టి ఎప్పుడూ కాగితాలమీద లెక్కలు వేయకూడదు. మీకు నిజమైన లాభం ఆ షేర్ని అమ్మినపుడే వస్తుంది. అంతేకాని పేపర్లో చూసి లెక్కలు వేస్తుంటే అది ఎప్పటికీ రానట్లే! కాలక్రమాన తగ్గడం మొదలవుతుంది. మళ్ళీ పెరుగుతుందిలే అని మీరు ఆశగా ఎదురుచూస్తారు. కాని అది పెరగదు. పెరిగినా వెనకటిలా అనేక రెట్లు పెరగకపోవచ్చు. కొద్దిగా పెరగవచ్చు. ఉదాహరణకు బూమ్ సమయంలో రూ. 10,000 తాకిన విజువల్ సాఫ్ట్వేర్ ప్రస్తుతం లిస్టింగ్ కూడా కావటం లేదు.

కాబట్టి మీరు ఎప్పుడూ ఏ షేర్ మీద మమకారం పెట్టుకోవద్దు. షేర్లనేవి వట్టి కాగితాల కట్టలు మాత్రమే. అందువల్ల అలాంటి వాటిని వీలైనంగా అధిక ధర రాగానే అమ్మేసి సొమ్ము చేసుకోవాలి.

ఇంకొంత మంది ఇన్వెస్టర్లు ఉంటారు. రిలయన్స్, టిస్కో లాంటి షేర్లు కొని బీరువాలో దాస్తారు. రోజూ పేపర్లలో వాటి ధర చూసుకొని తృప్తిపడుతుంటారు. తగ్గితే మళ్ళీ పెరుగుతుందిలే అనుకుంటారు. మళ్ళీ పెరగగానే ఆహా అనుకుంటారు తప్ప వాటిని అమ్ముకొని తిరిగి తగ్గినాక కొందామన్న అసక్తి వుండదు. అదేమంటే ఆ షేర్లు తమకు శాశ్వతమైన ఆస్థి, వాటిని అమ్మడానికి కాదు ఉంచుకున్నది అంటారు. కాని అలాంటి వారు సైతం షేర్ల మీద మమకారం పెట్టుకోకుండా పెరిగిన సమయంలో అమ్మేసి, తగ్గిన సమయంలో కొనుక్కుంటే ఆ తేడాలోనే లక్షలు కళ్ళ జూస్తారు. -

చకచకా వ్యూహాలు మార్చేవాడే చక్కటి ఇన్వెస్టర్

నిజానికి మంచి స్టాక్ మార్కెట్ వ్యూహకర్త ఎప్పుడూ ఏ షేర్లని అట్టిపెట్టుకోడు. మార్కెట్ పరిస్థితికనుగుణంగా అధిక ధరలో షేర్లని అమ్ముతాడు. బుల్ మార్కెట్లో సైతం కొన్ని మట్టిలో మాణిక్యాల్లాంటి షేర్లని తక్కువ ధరకు కొంటారు. అలాంటి వారు ఏ షేర్ మీద సెంటిమెంట్లు పెట్టుకోవద్దు. తనకు కావాల్సిన విధంగా వ్యూహాలు మార్చుకొని లాభాలు చేసుకుంటాడు.

ఏది ఏమైనా షేర్ల మీద మమకారం లేకుండా వాటిని సరైన సమయంలో అమ్మేసి తిరిగి తగ్గిన సమయంలో (లేదా బూమ్లోనే మట్టిలోని మాణిక్యాలాంటి షేర్లు) కొన్నవారే విజ్ఞుడైన ఇన్వెస్టర్. అలాంటి వారే ఎప్పటికయినా స్టాక్ మార్కెట్లో విజేతగా వెలుగొందుతాడు.

Close