-->

షేర్లను ఎప్పుడు అమ్మాలి? - When to sell shares?

Also Readనిజానికి షేర్లను ఎప్పుడు కొనాలన్న నిర్ణయం కంటే ఎప్పుడు అమ్మాలి అన్నదే క్లిష్టమైన సమస్య. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్లు ఎంత ఉత్సాహంతో షేర్లను కొంటారో అదే ఉత్సాహంతో అమ్మటానికి సంసిద్దులు కారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవి:

1. నష్టము వస్తుందన్న భయం:

చాలా మంది ఇన్వెస్టర్లు తాము కొన్న ధర కంటే ఇంకా తగ్గగానే దానిని నష్టానికి అమ్ముకోవటానికి ఇష్టపడరు. నిజానికి అలాంటి షేర్లు వెంటనే అమ్మేయటం ఉత్తమం. లేకుంటే షేర్లు ధర ఇంకా తగ్గి మరింత నష్టం సంభవించడం జరుగుతుంది. నిజానికి షేర్ మార్కెట్లో లాభానికి ఎంత అవకాశం ఉందో నష్టానికి అంత అవకాశం ఉంది. అందువల్ల నష్టాలను సైతం అంగీకరించి తదుపరి వ్యవహారంలో లాభాలను పొందడానికి పూనుకోవాలి.

2. సెంటిమెంటు:

చాలా మంది ఇన్వెస్టర్లు తాము కొన్న షేర్ల పట్ల మమకారంతో వాటిని వుంచుకోవాలనుకుంటారు. కొంతమంది 'తమది అదే మొదటి ఇన్వెస్టుమెంటు' అని, కొంతమంది ఆ కంపెనీ అంటే తమకెంతో ఇష్టమని, కొంతమంది ఆ షేర్లు తమ వృత్తికి సంబంధించినవి అని ఆ షేర్లను వదులుకోవడానికి ఇష్టపడరు.
మన డబ్బును సక్రమ మార్గంలో వినియోగించాలంటే సెంటిమెంటును తీసి ప్రక్కన పడేయాలి. షేర్ల బిజినెస్లో సెంటిమెంట్లకు స్థానం ఉండరాదు. ఎంత తేలిగ్గా షేర్లను కొంటామో అంత వేగంగా అమ్మగలగాలి.

3. బద్దకం :

కొంతమంది ఇన్వెస్టెర్లు షేర్లని కొని బీరువాలో లేదా ఇనపెట్టెలో పడేస్తారు.  సం॥రాలు తరబడి అలా అవి మగ్గిపోతూనే ఉంటాయి. నిజానికి వాటిలో కొన్ని షేర్లు అత్యధిక స్థాయికి వెళ్ళ వచ్చు. మరికొన్ని షేర్ల తాలూకు కంపెనీలు ఎప్పుడో మూతబడి ఉండవచ్చు. కాని సోమరితనంతో కూడిన ఇన్వెస్టర్లు వాటిని పట్టించుకోరు. ఆ తర్వాత ఎప్పటికో మేల్కొని లబోదిబోమంటారు.

షేర్లను ఎప్పుడు అమ్మాలి?

షేర్లని అమ్మడానికి ఈ క్రింది పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు. అవేమిటో చూద్దాం.

1. ఒక షేరు మీద మీకు 30 నుండి 50 శాతం రెట్టింపు లాభం వస్తే వెంటనే అమ్మేయండి. ఇంకా ఎంతో పెరగవచ్చు అన్న ఆశాభావం ఉన్నా, వచ్చిన లాభంతో సంతృప్తిపడి అమ్మివేయండి.

2. సాధారణంగా షేర్లను అమ్మటానికి జులై నుండి నవంబర్ మంచి సమయం. ఎందకంటే ప్రతి సం॥ ఆయా నెలల్లో మార్కెట్ ఆశాజనకంగా ఉంటుంది. అంతేకాదు. 90% కంపెనీలు, ఆయానెలల్లో బుక్ క్లోజర్లు ప్రకటిస్తూ ఉంటాయి. అందువల్ల షేర్లను అమ్మటానికి జులై నుండి నవంబర్ అనువైన సమయంగా విజ్ఞులు భావిస్తారు.

3. ఒక షేరు మీద మీరు అనుకున్న లక్ష్యపు పెరుగుదల (Target) దాటగానే వెంటనే అమ్మేయండి. ఉదాహరణకు పదిరూపాయలు ఉన్న ఓ షేరు రెండు నెలల్లో 15 రూపాయలు అవుతుందన్న ఉద్దేశ్యంతో కొంటారు. ఖచ్చితంగా ఆ షేరు మీరనుకున్న టార్గెట్ చేరగానే అమ్మేయండి. ఇంకా ఆ షేరు మీద ఆశలు పెట్టుకుంటే మొదటికే మోసం రావచ్చు.

4. ఒక కంపెనీ ఉత్పత్తికున్న డిమాండ్ తగ్గిపోతుందనుకోండి. వెంటనే అమ్మేయండి. ఉదాహరణకు అరుణ్ కంటెయినర్స్ కంపెనీ. ఈ కంపెనీ ప్యాకేజి రంగంలో ఇనుప డబ్బాలు తయారు చేస్తుంది. కాని ప్రస్తుతం బోర్న్ వీటా, బూస్టింటి ఉత్పత్తులకు ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నందున అరుణ్ కంటెయినర్స్ కంపెనీ చేసే ఇనుప డబ్బాలకు డిమాండ్ తగ్గింది.

5. ఒక షేరు మీరు కొనగానే నష్టం వస్తే వెంటనే అమ్మేయండి. ఉదాహరణకు 25 శాతం వరకు నష్టం వస్తే భరించవచ్చు. అంతకంటే ఎక్కువ నష్టం వస్తే లోపం మనలోనే ఉందన్నమాట. కాబట్టి ఓ షేరు 25 లేదా ఇంకా ఎక్కువ శాతంలో నష్టం వస్తే వెంటనే అమ్మేసి, నష్టాలను తగ్గించుకోండి.

6. అందరూ వెళ్ళేదారిలో కాక భిన్నమైన మార్గంలో వెళ్ళగలగాలి. మార్కెట్ బూమ్లో ఉన్నపుడు అమ్మండి. మార్కెట్ బలహీనంగా వున్నప్పుడు షేర్లు కొనండి అప్పుడే లాభాలు సంపాదించగలం.

Close