-->

చిన్న పుస్తకం, గొప్ప జీవితం... నిరంతర పోరాట స్ఫూర్తి భగత్ సింగ్. - అశోక్ థావలె - A short book, a great life... Bhagat Singh's spirit of continuous struggle.

Also Read


భగత్ సింగ్ జైలును గ్రంథాలయంగా మార్చుకున్నాడు. జాబితాలు రాసి మరీ పుస్తకాలు తెప్పించుకుని చదివాడు. తమ విశ్వాసాలను, అభిప్రాయాలను వెల్లడించే అనేక వ్యాసాలు రాశాడు. 'నేనెందుకు నాస్తికుడయ్యాను?’ ‘వీలునామా', (యువతకు విజ్ఞప్తి) వంటివి వాటిలో మనకు దక్కాయి. మరికొన్ని అమూల్యమైన రచనలు దక్కలేదు. ప్రచురితమైన మేరకు ఆయన ప్రతిరచనలోనూ విప్లవం పట్ల, ప్రజలను చైతన్య పరచడం పట్ల అంతులేని శ్రద్ధ గోచరిస్తుంది. తానెప్పుడూ టెర్రరిస్టును కానని ఆయన గట్టిగా వివరిస్తాడు.

భగత్ సింగ్!

ఆపేరు తల్చుకోగానే భారతీయులలో సాహస స్ఫూర్తి కదలాడుతుంది. ఒకదశలోనైతే భగత్ సింగ్ పేరు ప్రఖ్యాతులు మహాత్మాగాంధీని కూడా మించిపోయాయట. ఎప్పటికీ మరపురాని స్ఫూర్తిగా నిలిచిపోవడం భగత్ సింగ్ ప్రత్యేకత. 1906 సెప్టెంబరు 28న జన్మించిన భగత్‌సింగ్ శతజయంతి సంవత్సరం ఇది. ఈ సందర్భంగా భగత్ సింగ్ జీవిత రాజకీయ విశిష్టతలను వివరిస్తూ, విశ్లేషిస్తూ అశోక్ థావలే రాసిన పుస్తకం 'నిరంతర పోరాట స్ఫూర్తి భగత్ సింగ్'. 40 పేజీల ఈ పుస్తకంలో నాటి దేశ రాజకీయ పూర్వరంగాన్ని, భగత్‌సింగ్‌ను విలక్షణ విప్లవకారుడుగా నిలిపిన అంశాలనూ తెలుసుకోగలం. అశోక్ థావలె అనేక గ్రంథాలు అధ్యయనం చేసి రాసిన కారణంగా ఎన్నో విషయాలు తెలుస్తాయి.
తొలి దశలో పంజాబ్, బెంగాలలో ప్రధానంగానూ, కొంతవరకు మహారాష్ట్రలోనూ విప్లవకారులుండేవారు. ప్రాణాలను కూడా లెక్కించకుండా వీరు బ్రిటిష్ ప్రభుత్వాన్ని సవాలు చేశారు. అయితే ప్రజల చైతన్యం తగినంతగా పెరగని దశ అది. అందుకే వారి త్యాగాలు గుర్తింపుకు నోచుకోలేదు. భగత్ సింగ్ బృందం రంగంలోకి వచ్చేనాటికి ప్రజలు పోరాటాలలో వువ్వెత్తున పాల్గొంటున్నారు. వారి సాహసోపేత పోరాటాలూ, బలిదానాలు చెరగని ముద్ర వేశాయి.

విద్యావతి, కిషన్‌సింగ్ దంపతుల కుమారుడు భగత్ సింగ్. తండ్రి, మామయ్య కూడా స్వాతంత్ర్య యోధులుగా జైలుకు వెళ్లిన వారే. ఉరికంబమెక్కిన వీరుడు కర్తార్ సింగ్ ఫొటో జేబులో పెట్టుకుని తిరిగేవాడు. జలియన్ వాలాబాగ్ వెళ్లి మృతులకు శ్రద్ధాంజలి ఘటించి అక్కడ సేకరించిన మట్టిని ఒక సీసాలో వేసి జీవితమంతా అట్టిపెట్టుకున్నాడు. బిఎ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. పెళ్లికి బలవంతం చేస్తే 'ఇది పెళ్లికి సమయం కాదు. దేశమాత నన్ను పిలుస్తోంది' అని జవాబు చెప్పాడు.

గాంధీజీ పిలుపుపై వువ్వెత్తున రగుల్కొన్న సహాయనిరాకరణ వుద్యమాన్ని చౌరీచౌరా ఘటన కారణంగా వుపసంహరించడం (1922) యువతను తీవ్రాగ్రహానికి గురి చేసింది. గాంధీజీపై ఆశలు పెట్టుకున్న యువత మళ్లీ తీవ్రవాదంవైపు మొగ్గడం మొదలైంది. 1921లో భగత్ సింగ్ ఒక వ్యాసంలో తన అభిప్రాయాలు వివరించారు. నిజమైన విప్లవకారులు గ్రామాల్లోనూ ఫ్యాక్టరీల్లోనూ వున్నారని తెలిసినా ఒక్కసారి వారిని మేల్కొల్పితే తర్వాత కూడా ఆపలేమన్న భయంతో మన నాయకులు వారిని రంగంలోకి తీసుకురావడం లేదని విమర్శించాడు. రష్యాలో వచ్చిన బోల్షివిక్ విప్లవం వారిపై ప్రభావం చూపింది. 1920లోనే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఈ ఘటనలన్నిటి నేపథ్యంలో భగత్‌సింగ్ బాగా లోతుగా అధ్యయనం చేశాడు. మార్క్సిజంవైపు ఆకర్షితుడయ్యాడు. కాన్పూర్ ని హిందూస్థాన్ రిపబ్లికన్ ఆర్మీలో చేరాడు. ఆ సంస్థ ప్రణాళికకు 'విప్లవకారుడు' అని పేరు పెట్టారు. వీరంతా విప్లవ రాజకీయాలను చేపట్టడం, అదే సమయంలో వ్యూహాత్మక విప్లవ దశ నుంచి బయట పడలేకపోవడం గమనించాల్సిన అంశాలు. హెచార్ఎ లూటీలు, ఆయుధాల అపహరణ వంటి పనులు చేసింది. పట్టుబడిన వారికి శిక్షలూ పడ్డాయి.

ఆ తర్వాత మిత్రులతో కలసి 'నౌజవాన్ భారత్' సభ ఏర్పాటు చేశాడు. పలు శాఖలు ఏర్పడ్డాయి. ప్రజల కోసం ప్రజల చేత విప్లవం తెస్తామని అందులో ప్రకటించారు. వారికి కమ్యూనిస్టులతోనూ సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ సంస్థ మతతత్వానికి ఏమాత్రం ఆస్కారం లేని లౌకిక విధానం కూడా ప్రకటించింది. లాలాజీ ఒక దశలో మతతత్వానికి లోనైనప్పుడు భగత్ సింగ్ ఆయన పేరెత్తకుండానే శక్తివంతమైన విమర్శ చేశాడు. క్రమేణా చంద్రశేఖర్ ఆజాద్ కమాండర్‌గా 'హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ' ఏర్పాటైంది. భగత్ సింగ్ సూచనపై సోషలిజాన్ని అది తన లక్ష్యంగా ప్రకటించింది. దానిలోని రాజకీయాలే గాక రచనా శైలి కూడా చాలా ఉత్తేజకరంగా వుంటుంది. ఈలోగా లాలాజీపై లాఠీచార్జి, ఆ దెబ్బలతో ఆయన మృతిచెందడం దేశాన్ని కుదిపేశాయి. జాతిచైతన్యాన్ని ప్రతిబింబించేందుకై ఇందుకు కారకుడైన శాండర్స్న హతమార్చాలని నిర్ణయించారు.
ఉధృతమవుతున్న పోరాటాలను అణచేసేందుకై ప్రజాభద్రతా చట్టం పేరిట నిరంకుశ శాసనం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సందర్భంగా 1928 ఏప్రిల్ 8న జాతీయ శాసనసభలో బాంబులు వేసిన ఘటన భగత్ సింగ్ విప్లవ జీవితానికి తారాస్థాయి.

తమ నిరసనను దేశ ప్రజల దృష్టికి తేవాలని తప్ప ఎవరినీ చంపాలని ఈ దాడిచేయలేదు గనక తర్వాత భగత్ సింగ్, ఆయన సహచరుడు ఘటకేశ్వర్ దత్తులు కావాలనే పట్టుబడ్డారు. అప్పటి నుంచి విచారణ జరిగినంత కాలమూ విప్లవం గురించి శక్తివంతంగా వివరించాడు భగత్ సింగ్. కోర్టుల్లోనూ, జైళ్లలోనూ ఆ విప్లవకారులు తమ పోరాటం కొనసాగించారు. ముఖ్యంగా భగత్ సింగ్ జైలును గ్రంథాలయంగా మార్చుకున్నాడు. జాబితాలు రాసి మరీ పుస్తకాలు తెప్పించుకుని చదివాడు. తమ విశ్వాసాలను, అభిప్రాయాలను వెల్లడించే అనేక వ్యాసాలు రాశాడు. 'నేనెందుకు నాస్తికుడయ్యాను?’ ‘వీలునామా', (యువతకు విజ్ఞప్తి) వంటివి వాటిలో మనకు దక్కాయి. మరికొన్ని అమూల్యమైన రచనలు దక్కలేదు. ప్రచురితమైన మేరకు ఆయన ప్రతిరచనలోనూ విప్లవం పట్ల, ప్రజలను చైతన్య పరచడం పట్ల అంతులేని శ్రద్ద గోచరిస్తుంది. తానెప్పుడూ టెర్రరిస్టును కానని ఆయన గట్టిగా వివరిస్తాడు.

వ్యక్తిగత ఔన్నత్యం మరింత గొప్పది. ఉరికొయ్య కళ్లముందు వేలాడుతున్నా వారు చలించలేదు. తన తండ్రి తనకు క్షమాభిక్ష కోసం ప్రయత్నించాడని తెలిసి 'నా జీవితం నా ఆశయాల కన్నా విలువైనదేం కాదు' అని ఆగ్రహం, ఆవేదన కలగలిపి రాస్తాడు భగత్ సింగ్. దోపిడీ శక్తులు ఏ రూపంలో పెత్తనం చేస్తున్నా ఆ స్వాతంత్రం సంపూర్ణం కాదన్నాడు. 'జీవించాలనే కాంక్ష చాలా సహజమైనది. అయినా నేను ఏవో ఆంక్షల మధ్య ఖైదీగా బతకాలనుకోవడం లేదు. భారత విప్లవోద్యమానికి నా పేరు ఒక ప్రతీకగా మారింది. మరికొంత కాలం వుంటే నా లక్ష్య సాధనకు ఇంకా కృషి చేయగలిగేవాడినన్న భావన తప్ప మరో బాధ లేదు. అయినా నా జీవితం పట్ల గర్విస్తున్నా' అని చివరి దశలో ఒక మిత్రుడి ప్రశ్నకు జవాబుగా రాశాడు. చివరి రోజున తలారి వచ్చి సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథసాహెబా ఇస్తే వద్దని సున్నితంగా తిరస్కరించాడు. పైగా లెనిన్ విప్లవ జీవితం చదివి ఉరి శిక్షకు సిద్ధమయ్యాడు. 'విప్లవం వర్ధిల్లాలి' అనే నినాదాల మధ్య భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు 1931 మార్చి 23న ఉరికంబమెక్కారు.

ఈ పరిణామాలన్నిటినీ ఈ పుస్తకంలో క్లుప్తంగా తెలుసుకోవచ్చు. భగత్ సింగ్ బృందాన్ని కాపాడటంలో గాంధీజీ శ్రద్ధ చూపాడా లేదా అన్న విషయాన్ని కూడా పరిశోధకుల రచనల నుంచి రచయిత చక్కగా వివరించారు. భగత్ సింగ్ విప్లవ జీవిత ప్రస్థానాన్ని తెలుసుకోవడానికి ఈ చిన్న పుస్తకం బాగా దోహదపడుతుంది.

Close