-->

షేర్లలో పెట్టుబడి వల్ల లాభాలు, నష్టాలు - Profits and Losses of Investing in Shares

Also Read



ఇంతకు ముందు అధ్యాయంలో వాటా అంటే ఏమిటో, కంపెనీ తన కొచ్చిన లాభాలను ఈ వాటాదారులకు ఎలా పంచుతుందో తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో షేర్ల పెట్టుబడి వల్ల సంభవించే లాభనష్టాలు తెలుసుకుందాం.

షేర్లలో పెట్టుబడి వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో చూద్దాం.

1. పెట్టుబడి వృద్ధి : అసలు షేర్లలో పెట్టుబడి ఎందుకు పెడతారో చెప్పమంటే ఆ షేర్ ధర పెరగడం కోసం అని చాలా మంది చెప్తారు. దీనినే పెట్టుబడి వృద్ధి అంటారు. ఉదాహరణకు 'X' అనే వ్యక్తి ప్రస్తుతం 400 రూపాయల చొప్పున రిలయన్స్ షేర్లు 100 కొంటాడు. ఒక పది రూపాయలు ముఖ విలువ గల షేర్ని ఎందుకు అంత పెట్టి కొంటాడు అంటే ఆ 400 రూపాయల షేరు రేపే 700 రూపాయలు అవుతుంది కదా అంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎక్కువగా షేర్లు కొనడానికి కారణం ఈ పెట్టుబడి వృద్ధి అని చెప్పక తప్పదు. బంగారం, స్థలాలు, బ్యాంకు డిపాజిట్లు రెట్టింపు కావాలంటే (లేదా గణనీయంగా పెరగాలంటే) చాలా సమయం తీసుకుంటాయి. అదే షేర్లయితే త్వరితగతిన పెరుగుతాయి (లేదా తగ్గుతాయి). కాబట్టి షేర్ల వల్ల అత్యధిక లాభం మూలధన వృద్ది అని చెప్పక తప్పదు.

2. డివిడెండ్లు : కేవలం పెట్టుబడి వృద్దే కాక ప్రతి సం॥ కంపెనీ ఇచ్చే డివిడెండ్ల వలన కూడా చాలా మంది షేర్లలో పెట్టుబడి పెట్టడానికి సంసిద్దులవుతారు. స్థలాలు, బంగారం లాంటివాటి మీద ప్రతి సం|| ప్రతి ఫలాలు రావు. కాని మంచి కంపెనీలెప్పుడూ వాటాదారులకు చక్కటి డివిడెండ్లను అందిస్తాయి. ఉదాహరణకు Noida Toll ఈ సం॥ 30 శాతం, IFCI 10 శాతం డివిడెండ్ని ప్రకటించారు. ఇలాంటి డివిడెండ్లు కూడా వాటాదారులను ఉత్తేజపరుస్తాయి.

3. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవడం షేర్లకున్న మరో గొప్ప ప్రయోజనం ఏమిటంటే - మనకు ఎప్పుడు డబ్బులు కావాలంటే ఆప్పుడు షేర్లను అమ్ముకోవచ్చు. మనం షేర్లని అమ్మిన రోజే మనకు ఆ షేర్ల తాలుకూ డబ్బు వచ్చి చేతిలో పడుతుంది. అదే స్థలాలు, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లయితే డబ్బుని వెంటనే పొందలేము.

4. నిర్వహణ తేలిక : షేర్ల సర్టిఫెకెట్లని నిర్వహించడం తేలిక. ప్రస్తుతం అమలులో ఉన్న 'డిమ్యాట్' విధానం వల్ల ఈ షేర్లని బ్యాంకు పాస్బుక్ గా నిర్వహించడం చాలా తేలిక. స్థలాల్లో ఉండే కబ్జా, బంగారంలో వుంటే దొంగతనాల్లాంటివి ఈ షేర్ల నిర్వహణలో ఉండవు.

5. ఇతర ప్రయోజనాలు : కేవలం పైన చెప్పిన లాభాలే కాకుండా షేర్ల కొనుగోలు - అమ్మకాల వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు వున్నాయి.

(ఎ) ఒక్కోసారి కంపెనీ మనకు బోనస్ షేర్లు, రైట్స్, ప్రిఫరేన్షియల్ షేర్లని అందజేస్తాయి. అవి ఉచితంగా లేక కొద్దిపాటి ధరతో మనకు ఇస్తాయి.

(బి) షేర్లని ఒకరి నుండి మరొకరికి తేలికగా మార్పిడి చేయవచ్చు.

(సి) షేర్లని ఎంత తక్కువ డబ్బుతోనైనా కొనవచ్చు. ఉదాహరణకు మన దగ్గర ఐదొందలు ఉంటే చాలు, షేర్లు కొనవచ్చు, అమ్మవచ్చు.

(డి) షేర్లలో ఇతర స్థిరాస్లుల్లా టాక్స్ లు వుండవు. ఆస్తిపన్ను, ఇన్సూరెన్స్ పన్నుల్లాంటివి షేర్లకు ఉండవు. కేవలం కొద్ది రకాల నామమాత్రపు పన్నులు మాత్రం ఉంటాయి.

షేర్ల పెట్టుబడి వల్ల నష్టాలు:

అయితే పైన చెప్పిన లాభాలే కాకుండా, షేర్లలో పెట్టుబడి వల్ల కొన్ని సమస్యలూ ఉన్నాయి. అవి 1. రిస్క్ ఎక్కువ : షేర్లలో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్ తో కూడిన పని. ఎందుకంటే తరచూ మార్పులకు లోనవుతాయి. మనం కొన్న షేర్ల ధరలు పెరగవచ్చు లేదా తరగవచ్చు కాని స్థిరంగా వుండవు. అదే స్థలం, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లలో మీ పెట్టుబడి పెరగకపోయినా తరిగే అవకాశాలు తక్కువ. షేర్లకుండే ఈ రిస్క్ గుణం వల్ల చాలా మంది షేర్ మార్కెట్లో అడుగుపెట్టడానికి జంకుతున్నారు. అయితే ఈ షేర్ మార్కెట్లో కాస్తంత కామన్సెన్స్, నేర్పుతో ముందే రిస్క్లను కనిపెట్టగలిగితే నష్టాలు రావడానికి అవకాశాలు తక్కువ.

2. లాభాలకు గ్యారంటీ లేదు: షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల అన్ని కంపెనీలూ లాభాల్ని ఆర్జిస్తాయని చెప్పలేం. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉందని అనుకున్న కంపెనీకి లాభాలు తక్కువ రావచ్చు. ఒక వేళ కంపెనీలు అధిక లాభాలు సంపాదించినా, వాటిని వాటాదారులకు పంచుతుందని గ్యారంటీ లేదు. ఆ లాభాలను కంపెనీ విస్తరణ నిమిత్తం తన ఇనుపపెట్టె (రిజర్వుల నిధి)లోకి మరలించవచ్చు. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లతో స్థిరమైన ఆదాయం వచ్చినట్లుగా ఈ షేర్ బిజినెస్లో ఖచ్చితమైన ఆదాయం లభిస్తుందని చెప్పలేము. అయితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉండే కంపెనీలను ఎన్నుకొని పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.

3. బ్రోకర్ల వల్ల ఒనగూరే నష్టాలు : స్టాక్ ఎక్సేంజికి, ఇన్వెస్టరుకి మధ్య దళారిగా పని చేసేవాడే స్టాక్ బ్రోకరు. ఇన్వెస్టర్ని నేరుగా స్టాక్ మార్కెట్లోకి అనుమతించనందువల్ల బ్రోకర్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ బ్రోకర్ల వల్ల ఇన్వెస్టర్లకి చాలా తలనొప్పులు ఉన్నాయి. అధిక ధరల్లో షేర్లు కొనడం, ఎక్కువ కమీషన్ తీసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. వీటినన్నింటినీ నివారించాలంటే మంచి బ్రోకరుని ఎన్నుకోవడం ముఖ్యం. అది వాటాదారుని విజ్ఞత మీద, ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాదు - స్టాక్ ఎక్సేంజ్ లావాదేవీలన్నీ ఇన్వెస్టర్లు తెలుసుకోవడం మంచిది. అందువల్ల బ్రోకర్ల అవకతవకలను అరికట్టవచ్చు.

Close