-->

ఇన్వెస్టర్లు షేర్లని ఎలా కొనాలి? అమ్మాలి? - స్టాక్ మార్కెట్లో షేర్ల వ్యాపారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. - How should investors buy shares? sell?

Also Readబ్రోకర్ ఎన్నిక:

ఇంతకు ముందు చెప్పినట్లుగా స్టాక్ ఎక్ఛేంజ్‌లో కేవలం ఆధారిత సభ్యులు (బ్రోకర్లు) మాత్రమే వ్యాపారం చేయగలుగుతారు. అందువల్ల ఇన్వెస్టర్ ముందుగా సరైన స్టాక్ బ్రోకర్ని ఎన్నుకోవాలి.

మీ మిత్ర బృందంలోనో, బంధువుల్లోనో, పరిచయస్తుల్లోనో తెలిసిన బ్రోకర్ ఉంటే మీకు కూడా అతడిని పరిచయం చేయమని చెప్పండి. అదీ లేకపోతే ఆన్లైన్లోఎంతో మంది ఉన్నారు.

మీ పరిచయస్తులు, మిత్రుల నుండి కాక మీ అంతట మీరే బ్రోకర్ దగ్గరకి వేళ్తే మిమ్మల్ని కొంత మార్జిన్ డబ్బు కట్టమని బ్రోకర్ కోరవచ్చు. మీరు కొనాలనుకున్న షేర్ల డబ్బులో కనీసం 30 శాతం ముందుగా చెల్లించమని కోరవచ్చు. ఎందుకంటే కొత్తవారు షేర్లు కొనగానే కన్పించకుండా పారిపోతే, ఆ షేర్ల ధర తగ్గి తిరిగి అమ్ముకోవాలంటే బ్రోకర్ నష్టపోతాడు. అందుకే కొంత మార్జిన్ మనీ (అడ్వాన్స్ మనీ) కడితే ఇన్వెస్టర్ కన్పించకపోయినా ఆ డబ్బుతో బ్రోకరు సర్దుబాటు చేసుకుంటారు. ఏదిఏమైనా బ్రోకర్లు-క్లయింటు మధ్య ఎప్పుడూ చక్కటి నమ్మకం సద్భావం, సౌహర్దత ఉండాలి. అపనమ్మకం, తప్పించుకోవడం, కన్పించకుండా పోవడం లాంటి ప్రతికూల భావాలుగలవారు స్టాక్ మార్కెట్లో ఎక్కువ కాలం మనలేరు.

డిమ్యాట్ అకౌంట్

మనం షేర్లు కొనాలన్నా, అమ్మాలన్నా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అంటే మన బ్యాంకులో డబ్బు వేసినట్లుగా లేదా తీసినట్లుగా షేర్లను మన అకౌంట్లో డిపాజిట్ చేసినట్లుగా, అలాగే షేర్లను అమ్మినప్పుడు అందులో నుండి బయటకు వెళ్ళినట్లుగా చూపే అకౌంట్‌నే 'డీమ్యాట్ అక్కౌంట్' అంటారు. ఇది తప్పనిసరి. దీనిని మీరు పేరుపొందిన జాతీయ బ్యాంకులు, లేదా ప్రైవేట్ బ్యాంకులైన ICICI, HDFC, UTI లాంటి బ్యాంకుల్లో తెరవవచ్చు. సాధారణంగా మీరు ఎన్నుకున్న బ్రోకర్ మీకు ఈ డీమ్యాట్ అక్కౌంట్‌ని తెరవడంలో సహాయం చేస్తాడు.

రిజిస్ట్రేషన్ ఫారం

ఒకసారి బ్రోకర్ని ఎన్నుకున్నాక మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. ఇందులో మీ పేరు, ఫోటో, అడ్రసు, బ్యాంక్ అక్కౌంట్ నెం., ఇన్‌కంటాక్స్ పాన్ నెం. తదితర వివరాలు ఉంటాయి. సెబి నిబంధనల ప్రకారం స్టాక్ మార్కెట్లో బ్రోకర్ ద్వారా వ్యాపారం చేసే ప్రతి ఇన్వెస్టర్ ఇలాంటి ఫారాన్ని తప్పనిసరిగా నింపాల్సి ఉంటుంది. దీనికి ఏ విధమైన ఫీజు జత చేయాల్సిన అవసరం లేదు. వీటిని నింపి బ్రోకర్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. బ్రోకర్ దానిని సెబికి పంపిస్తాడు.

కన్ఫర్మేషన్ స్లిప్

సరే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియ గానే మీరు షేర్ వ్యాపారం చేయాలను కుంటారు. ముందుగా ఏయే షేర్లు ఏ ధరకు కొనాలో బ్రోకర్‌కి చెప్పాలి. దీనినే ‘ఆర్డర్ చెప్పడం’ అంటారు. దీనిని వ్యక్తి గతంగా గాని, ఫోన్ ద్వారా గాని చెప్పవచ్చు. మీ ఆర్డర్లో మార్కెట్ ధర లేదా బెస్ట్ ప్రైజ్ ఆధారంగా షేర్లని కొనమంటే బ్రోకర్ ఆరోజు ఏ ధరకు లభిస్తే ఆ ధరకు కొంటాడు. అలాగే 'నాకు 100 రిలయన్స్ షేర్లు 1100 రూపాయలకు కావాలి' అని ప్రత్యేకంగా చెపితే, బ్రోకర్ ఆ ధరలోనే షేర్లు దొరికితే కొంటాడు. అలా మీరు చెప్పిన ఆర్డర్‌ని బ్రోకర్ కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేసి మీకు షేర్లు దొరికాయని చెప్తాడు. మీకు షేర్లు దొరికాక ఆ విషయాన్ని రూఢీ పరుస్తూ ఒక కాంట్రాక్ట్ నోట్‌ని తయారు చేస్తాడు. ఇందులో మీరు ఎన్ని షేర్లు ఎంత ధరకు ఎప్పుడు కొన్నారో, ఎంత బ్రోకరేజో తదితర వివరాలు ఉంటాయి. ఈ కాంట్రాక్ట్ నోట్‌నే 'కన్ఫర్మేషన్ స్లిప్' (రూఢీ కాగితం) అంటారు. దీనిని రెండు కాపీలు తయారు చేసి బ్రోకరు ఒక దానిని ఉంచుకొని, రెండో దానిని కస్టమర్ చేత సంతకం తీసుకుని ఇస్తాడు. దీనిల్ల మీ షేర్ల రేటు, సంఖ్య లాంటివి ఎవరూ మార్చకుండా ఉంటాయి.

అదే మీరు షేర్లు అమ్మేవారయితే కాంట్రాక్ట్ నోట్ తీసుకున్న మరుక్షణమే షేర్లని స్టాక్ బ్రోకర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. అదే మీ షేర్లు డీమ్యాట్ అకౌంట్ ఉంటే మీరు జమ ఉంచిన బ్యాంకు లేదా సంస్థ డీమ్యాట్ అక్కౌంట్ నెంబర్ తోపాటు ఆ షేర్లని బ్రోకర్‌కి బదిలీ చేయమని మీ డీమ్యాట్ అకౌంట్ ఉన్న బ్యాంకుకు కూడా Delivery Instruction for Transfer అనే కాగితం సంతకం చేసి ఇవ్వాలి. ఈ కాగితం మీదే డీమ్యాట్ అక్కౌంట్ నెంబరు, ఎన్ని షేర్లు అమ్మాలి లాంటి తదితర విషయాలు ఉంటాయి.

అదేవిధంగా షేర్లని కొన్న ఇన్వెస్టర్ సైతం కాంట్రాక్ట్ నోట్‌ని తీసుకున్న వెంటనే డబ్బు (క్యాష్గాని, చెక్కుగాని) చెల్లించాలి.

షేర్లు మనచేతికి ఎప్పుడు వస్తాయి లేదా డీమ్యాట్ అక్కౌంట్ లో జమ అవుతాయి?

మనం షేర్లు అమ్మితే మన చేతికి చెక్కు రావడానికి రెండుమూడు రోజులు పడుతుంది. ఎందుకంటే మనం అమ్మిన షేర్ల తాలూకు డబ్బుని ఎక్సేంజ్ ద్వారా మన బ్రోకర్ అందుకోవాలి కదా! అదే మనం షేర్లను కొంటేమటుకు చెక్కుని అదేరోజు లేదా మరుసటి రోజు ఉదయంకల్లా బ్రోకర్‌కి అందచేయాలి.

ఒకోసారి మనం షేర్లను అమ్మి వాటి స్థానంలో వేరే షేర్లు కొనుక్కోవాలనుకుంటే ఎలాంటి డబ్బుని బ్రోకర్‌కి చెల్లించాల్సిన అవసరం లేదు. షేర్లను అమ్మిన డబ్బు షేర్లను కొన్న డబ్బుతో సరిపోతే తిరిగి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిగణనలోకి తీసుకోవాలి.

1. షేర్లు కొనుగోలు అమ్మకం మీద బ్రోకర్ కొంత కమీషన్ తీసుకుంటాడు. ఈ కమీషన్ 0.25% నుండి 1% దాకా ఉంటుంది. ఉదాహరణకు మనం యాభైవేలు విలువ గల షేర్లు కొంటే, బ్రోకరికి ఒక పర్సంటేజి చొప్పున ఐదొందలు బ్రోకరేజి (కమీషన్) ఇవ్వాల్సి ఉంటుంది.

2. చాలా మంది ఇన్వెస్టర్లు బిజీ వల్ల రోజువారీ కాంట్రాక్ట్ నోట్లు తీసుకోరు. తాము చెల్లించాల్సిన మొత్తం ఎంతే తెలుసుకొని చెక్కు పంపిస్తారు. బ్రోకర్ నమ్మకస్తుడైతే కాంట్రాక్ట్ నోట్లు అవసరం లేదు. షేర్లని ఎంతకు కొన్నారో, అమ్మారో ఫోన్లో తెలుసుకుంటారు. ఇది బ్రోకరు - ఇన్వెస్టర్ నమ్మకం బలీయంగా ఉన్నచోట బాగా పని చేస్తుంది.

బ్రోకర్ నిర్ణీత రోజున మీకు డబ్బు లేదా మీ అక్కౌంట్లో సర్టిఫికెట్లు జమ చేయకపోతే?

అలాంటప్పుడు మీరు సెబికి ఫిర్యాదు చేయాలి. ఇలాంటి ఫిర్యాదులను సెబి పరిష్కరిస్తుంది. అలాంటప్పుడు మీరు షేర్లు కొన్నా లేదా అమ్మిన తాలూకు కాంట్రాక్ట్ నోట్‌ని రుజువుగా ఎక్సేంజ్ వారికి చూపించాల్సి ఉంటుంది.

Close