-->

స్టాక్ మార్కెట్లో వ్యాపారం ఎలాజరుగుతుంది ? - How does business work in the stock market?

Also Read


ఈ స్టాక్ మార్కెట్లో మిగతా వస్తువులు మార్కెట్లా జనాలు గుమికూడేటట్లుగా ఒక భవన సముదాయంలాంటివి వుండవు. ప్రతి బ్రోకర్‌కి ఓ కంప్యూటర్ ఉంటుంది. అలా దేశంలో అందరి బ్రోకర్లకి కంప్యూటర్లు ఉంటాయి. ఆ కంప్యూటర్‌కి సంబంధిత ఎక్సేంజ్‌కి శాటిలైట్ ద్వారా కనెక్ట్ చేయగానే షేర్ల ధరలు ప్రత్యక్షమవుతాయి. రకరకాల షేర్లు, ఏయే ధరలతో ఎన్ని (ఎంతమంది) అమ్ముతున్నారో, దాని కోసం ఏయే ధరలతో ఎంతమంది కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారో ఆ కంప్యూటర్ స్క్రీన్‌లో కన్పిస్తాయి. అలా దేశంలో అందరి బ్రోకర్ల కంప్యూటర్లు స్టాక్ ఎక్సేంజ్‌లోని సెంట్రల్ కంప్యూటర్‌తో అనుసంధానం చేయబడి షేర్లు ఒకదానికి (కొనేరేటు) మరొకటి (అమ్మేవారి రేటుకు 'మ్యాచ్' అయి కొనుగోళ్ళు, అమ్మకాలు జరుగుతాయి.

ఇక మనకు కావాల్సిన షేర్లని ఎలా కొనాలో చూద్దాం. ఉదాహరణకు మనకు రిలయన్స్ షేర్లు వెయ్యి రూపాలయల చొప్పున ఒక వంద షేర్లు కావాలనుకోండి. దానిని మీరు బ్రోకరికి కొనమని చెప్తే, అప్పుడు బ్రోకర్ ఆ ఆర్డర్‌ని కంప్యూటర్లో వుంచుతాడు. దేశంలోని ఇతర బ్రోకర్ల కంప్యూటర్లలో ఆ రేటుకు ఎవరైతే ఇవ్వడానికి సిద్ధపడతారో కంప్యూటర్ వెతుకుతుంది. మన ధరకి, ఆ ధరకి 'మ్యాచింగ్' (సరి) కాగానే కంప్యూటర్ ఆ రేటుకి షేర్లని మనకు ఫిక్స్ చేస్తుంది. అంటే ఆ ధరకు మనం 100 రిలయన్స్ షేర్లు కొన్నామన్నమాట. అదే ఇంకో బ్రోకర్‌కి 100 షేర్లు ఆ ధరకు అమ్మినట్లుగా చూపిస్తుంది. అలా నిర్ణీత సమయంలో అన్ని కంప్యూటర్లలో షేర్ల ధరలు అనుసంధానం జరిగి వ్యవహారాలు జరిగిపోతాయి. స్టాక్ ఎక్సేంజ్‌లో షేర్ల ట్రేడింగ్ అంతా ఈ ఎలక్ట్రానిక్ ప్రక్రియలోనే జరుగుతాయి. అంటే ఎలాంటి మోసాలకు, అక్రమాలకు తావు ఉండదు.

మరి పై ప్రక్రియలో స్టాక్ ఎక్సేంజ్ నిర్వహించే విధానం ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ద్వారా జరిగే లావాదేవీలను పర్యవేక్షించడం, బ్రోకర్ల ద్వారా జరిగే క్రయవిక్రయాలకు చెల్లింపులు సక్రమంగా జరిగేటట్లు చూడటం, ఏ బ్రోకర్ మీదైనా ఇన్వెస్టర్లు ఆరోపణ చేస్తే పరిశీలించి న్యాయాన్యాయాలు తేల్చడం, వీలైతే బ్రోకర్ మీద చర్య తీసుకోవడం, ఏ షేర్ ధరలోనైనా విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తే అప్పటికప్పుడు ఈషేర్ ధర ఆ రోజుకి ఇంత శాతం కంటే ఎక్కువ పెరగకూడదని పరిమితులు (సీలింగ్) విధించడం లాంటి చర్యలను చేపడుతుంది.

సెబి పాత్ర

దేశంలో అన్ని స్టాక్ ఎక్సేంజ్‌లు, బ్రోకర్ల మీద ఆధిపత్యం చేయడానికి ప్రభుత్వం ఒక సంస్థని నెలకొల్పింది. అదే సెబి (SEBI). సెబి అంటే Securities Exchange Board of India ఈ సెబి యొక్క ఆదేశాల ప్రకారం బ్రోకర్లు, స్టాక్ ఎక్సేంజ్‌లు నడుచుకోవాల్సి ఉంటుంది. షేర్ల ధరల్లో రిగ్గింగ్, బ్రోకర్ల ఆక్రమాలు, రిజిస్ట్రేషన్ తదితర వ్యవహారాల మీద సెబి నిరంతరం ఓ కన్నేసి ఉంచుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్టర్‌కి చిన్న అన్నయ్యలాంటివాడు స్టాక్ ఎక్సేంజ్ అయితే పెద్దన్నయ్యలాంటి వాడు ఈ సెబి. ఈ ఇద్దరు అన్యాయాలను, అక్రమాలను అరికట్టడానికి ఉపకరిస్తారు.

Close