-->

స్టాక్ మార్కెట్ లో పుకార్లు, వదంతుల ఆధారంగా మోసపోవద్దు - Do not be fooled by rumors and gossip in the stock market

Also Readమనం షేర్లని కొంటున్నపుడు బ్రోకర్ దగ్గరకు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వాతావరణం కోలాహలంగా ఉంటుంది. 'గురూ! అది నెలలో రెట్టింపు అవుతుందట’ అని ఒకడు, 'ఆ షేర్ వెనకాల బడా బాంబే ఆపరేటర్ వున్నాడు. అన్నీ అతడే కొంటున్నాడట' అని ఇంకొకడు అక్కడ హడావిడిగా అరుస్తుంటారు. ఫలితంగా మీ మనసు అటువైపు లాగుతుంది.
నిజం చెప్పాలంటే - అలాంటి పుకార్లు, అరుపులు మన ధృఢనిశ్చయాన్ని చెడగొడ్తాయి. అంతకు ముందు మనం కొనాలనుకున్న ఫండమెంటల్ షేర్లని గాలికి వదిలేసి దాని స్థానంలో అలాంటి చెత్త షేర్లని కొంటాం. అలాంటి షేర్లు మొదటి రెండు మూడు రోజులు పెరుగుతాయి. ఆ తర్వాత చకచకా తగ్గడం ప్రారంభిస్తాయి. మనకేం అర్థం కాదు. వెంటనే తిరిగి బ్రోకర్ ఆఫీసుకి వెళ్తాం. ఆ షేర్ విషయం అక్కడ అంతకు ముందే అలా అరిచిన వాడిని అడుగుతాం. నిజానికి అతడు సైతం ఢీలా పడి ఉంటాడు. అయినా అతడు తమాయించుకొని ‘బడా ఆపరేటర్ వూర్లో లేడట. అతడు రాగానే తిరిగి ఆపరేట్ చేస్తాడట' అని మనలను ఓదారుస్తాడు. మనం సంతృప్తిగా తిరిగి వస్తాం.
ఇంకో పది పదిహేను రోజుల్లో ఆ షేరు మనం కొన్న ధరలో పదో వంతుకు పడిపోతుంది. మనకి బిపి పెరిగిపోతుంది. మళ్ళీ బ్రోకర్ ఆఫీసుకు పరిగెడతాం. ఫలానా అరిచిన వాడు కోసం ఎంక్వయిరీ చేస్తాం. కానీ... వాడు ఎప్పుడో దివాళా తీసి బ్రోకర్కి సైతం డబ్బు ఎగ్గొట్టి పారిపోయాడని తెలిసి హతాశులవుతాం. అలా మనం నిలువునా మోస పోతాం.
నిజానికి షేర్లని ఆపరేట్ చేసే బడా ఆపరేటర్లు చాలా తక్కువ ధరలో వున్న షేర్లని కొనడం ప్రారంభిస్తారు. చాప క్రింద నీరులా ఆ షేర్లని ఎవరికీ తెలియకుండా జమ చేసుకుంటారు. అందరికి తెలిసేలా బహిరంగంగా చెయ్యరు.
ఎప్పుడయితే ఆ షేర్లు అధిక రేట్లుగా మారాయో వాటిని అమ్మే ముందు పుకార్లు, వదంతులు వ్యాపింపజేస్తారు. ఆ వదంతులు ఏమిటంటే ఆ షేర్లు అనంతాకాశంలోకి దూసుకెళ్తాయి. ఆ షేర్లు మూడు నాలుగింతలు పెరుగుతాయి. అలా ఆ పుకార్లు, వదంతులను జనంలోకి పంపిస్తారు. వాళ్ళు నిజమేనని నమ్ముతారు. ఆ అధిక రేట్లకి చాపక్రింద నీరులా ఆ ఆపరేటర్లు వాటిని ఇన్వెస్టర్లకి అమ్మేసి లాభం చేసుకొని నిష్క్రమిస్తారు. అదీ వాళ్ళ స్ట్రాటజీ!.
ఒక వేళ తాము ఫలానా షేర్ని అపరేట్ చేస్తున్నామన్న విషయం బయటికి వస్తే మటుకు వాళ్ళు ఆ షేర్లు కొనడం మానేస్తారు. అంతా చల్లబడగానే మళ్ళీ తక్కువ ధరలో ఉన్న వాటిని కొనడం ప్రారంభిస్తారు. వాటిని అమ్మేటపుడు మాత్రం కావాలని పుకార్లు, వదంతులు వ్యాపింపజేస్తారు. ఈ స్ట్రాటజీలో కొన్ని రకాల వాణిజ్య పత్రికలు, పేపర్లు సైతం పాల్గొనడం దురదృష్టకరం.
కాబట్టి అలాంటి చెత్త పుకార్లు, వట్టి మాటలకు మనం ప్రభావితం కాకుండా వుండాలి. అందుకు ఈ క్రింది చర్యలు తీసుకోవాలి.
1. వీలైనంగా బ్రోకర్ ఆఫీసుకి వెళ్ళకుండా ఉండాలి. ఒక వేళ వెళ్ళాల్సి వస్తే మీ చెక్ ఇచ్చి లేదా తీసుకొని వెంటనే వచ్చేయాలి.
2. ఫండమెంటల్స్ ఆధారంగా మీరు కొనాలనుకున్న షేర్లని ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పుకార్లు విని వాయిదా వేయకూడదు. మీరు కొనాలనుకున్న షేర్లు మీరు కొనండి.
3. ఒక వేళ అలాంటి వార్త రాగానే ఆ షేర్ తాలూకు ఫండమెంటల్స్ స్టడీ చేయండి. ఆ షేరికి సరైన ఫండమెంటల్స్ (ఇపియస్, డివిడెండ్, బుక్ వాల్యూ) సరిగా వుంటే అసలు ఆ షేర్ ఎప్పటి నుండి పెరుగుతుందో చూడటానికి వెబ్ సైట్లో ఆ తర్వాత ప్రస్తుత రేటులో ఆ షేర్ని కొనవచ్చో, లేదో మీ లాజిక్ని ఉపయోగించి పరిశీలించండి. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రండి.

Close