-->

శాసనశాఖ క్షీణత, సంక్షోభంలో జవాబుదారీతనం - Legislative Department, Decline, Accountability in Crisis

Also Read

శాసనశాఖ క్షీణత, సంక్షోభంలో జవాబుదారీతనం

ప్రజాస్వామ్య ప్రభుత్వమున్న దేశాలన్నింటిలో ప్రజాప్రతినిధులతో కూడి న శాసనశాఖ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాని ఇటీవల కాలంలో దాని ప్రాధాన్యత క్రమేణ తగ్గుతోంది. అందుకు ప్రధాన కారణాలు అనేకం... పాశ్చ్యా దేశాల్లో మాదిరి మన దేశంలో పౌర సమాజం (సివిల్‌ సొసైటీ) అంత శక్తివంతమైంది కాదు. సహజంగా ప్రజాప్రతినిధుల్లో జవాబుదా రీతనం లోపిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి తొలినాళ్లలో ప్రజా ప్రతినిధులు సేవకు అంకితమయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ప్రజాస్వామ్య ప్రభుత్వమున్న దేశాలన్నింటిలో ప్రజాప్రతినిధులతో కూడిన శాసనశాఖ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాని ఇటీవల కాలంలో దాని ప్రాధాన్యత క్రమేణ తగ్గుతోంది. అందుకు ప్రధాన కారణాలు...
 • ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, ప్రచారం.. ప్రచారానికవ సరమైన వనరుల సమీకరణ, శాసనశాఖలో సభ్యులు వ్యవహరిం చవలసిన తీరు తదితర విషయాల్లో రాజకీయ పక్షాలు, వాటి నాయకులు కీలకపాత్ర వహిస్తారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిం చవలసిన ప్రతినిధులు పార్టీ అభిప్రాయాలకు ప్రతిబింబంగా మారా రు. పార్లమెంటరీ ప్రభుత్వమున్న భారత్ వంటి దేశంలో ప్రభుత్వ ఏర్పాటు, దానిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడం మొద లైన విషయాల్లో ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ లేదు. పార్టీ జారీ చేసే విప్ నకు అనుగుణంగా వ్యవహరించాలి. దానిని ఉల్లంఘిస్తే క్రమ శిక్షణ చర్యలకు గురవుతారు. ఈ పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారు. వీరికంటూ ప్రత్యేక గుర్తింపు, వ్యక్తిత్వం లేకుండా పోయింది.
 • ఆధునికయుగం సంక్షోభయుగం. సంక్షోభ పరిస్థితుల్లో సహజంగా కార్యనిర్వాహక వర్గం మరిన్ని అధికారాలను కైవసం చేసుకుని శాసనశాఖను బలహీనపరుస్తుంది. యుద్ధాలు, ప్రకృతి వైపరీ త్యాలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభాలు వంటి కారణాలు కార్యనిర్వాహక వర్గం మరిన్ని అధికారాలను చలాయించడానికి దోహదం చేస్తాయి. సంక్షోభ పరిస్థితి ముగిసిన తర్వాత కూడా.. అంటే సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కార్యనిర్వాహక వర్గం అధికారయుతంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వంలోని మూడు ప్రధా నాంగాలైన- శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖల మధ్య సమతు ల్యత దెబ్బ తింటుంది.
 • ఆధునిక కాలంలో పాలనా ప్రక్రియ రోజురోజుకు మరింత క్లిష్టతను సంతరించుకుంటోంది. వృత్తి పరమైన నిపుణత కలిగిన ఉద్యోగ స్వామ్యం కార్యనిర్వాహక విధుల నిర్వహణలో ప్రముఖ పాత్ర వహిస్తూ, అంతంత మాత్రంగా పాలనా పరిజ్ఞానమున్న ప్రజా ప్రతి నిధులను నిర్వీర్యపరుస్తున్నారు.
 • ఇండియా లాంటి వర్ధమాన దేశాల్లో రాజకీయాలు నేరపూరితమవు తున్నాయి. నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధుల ముసుగులో అవినీతి చర్యలకు పాల్పడు తున్నారు. తమ నేరమయ కార్యకలాపాలను కొనసాగించడానికి, చట్టం కన్నుగప్పడానికి చూపించే శ్రద్ధ ప్రజా సమస్యల మీద చూప రు. చాలామంది ప్రతినిధులు నియోజకవర్గ ప్రజలకు అందుబా టులో లేకపోవడం, ప్రజా సమస్యల మీద స్పందించకపోవడం పరిపాటైంది.
 • తృతీయ ప్రపంచ దేశాల ప్రజల్లో రాజకీయ చైతన్యం అంతంత మాత్రమే. నిరక్షరాస్యత, పేదరికం మొదలైనవి సగటు పౌరుడిని తన రాజకీయ బాధ్యతలను నిర్వహించకుండా చేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో మాదిరి మన దేశంలో పౌర సమాజం (సివిల్ సొసైటీ) అంత శక్తివంతమైంది కాదు. సహజంగా ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం లోపిస్తుంది. బాధ్యతారహితంగా వ్యవహరించ డానికి వారు వెనుకాడరు.
 • మన దేశంలో పార్లమెంటు లేదా శాసనసభలు సగటున ఒక సంవ త్సరంలో 60 రోజులకు మించి సమావేశమవ్వట్లేదు. ఆ కొద్ది కాలంలో కూడా సభ్యులు సభా కాలాన్ని దుర్వినియోగం చేస్తు న్నారు. సభలో కేకలు పెట్టడం, నిరసన తెలుపుతూ సభను బహిష్క రించడం, సభా కార్యక్రమాలు సజావుగా జరగనివ్వకుండా సభాధ్య క్షుణ్ణి అడ్డుకోవడం మొదలైన అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతు న్నారు. కొన్ని సందర్భాల్లో వ్యతిరేక పార్టీ సభ్యుల మీద చేయి చేసుకోవడం జరుగుతోంది. ప్రజా సమస్యల మీద చర్చించడానికి బదులు వ్యక్తిగత దూషణలకు, అసత్య ఆరోపణలకు విలువైన సభా కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
 • సామాజిక విలువలు క్రమేణా దిగజారుతున్న నేపథ్యంలో ప్రజాప్ర తినిధులలో నీతి, నిజాయతీ, అంకితభావం కొరవడుతున్నాయి. ఇటీవల కాలంలో పార్లమెంటు సభ్యులు కొందరు డబ్బు తీసుకుని.. లంచం ఇచ్చిన వారికి సంబంధించిన అంశాలను ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తడం.. అది రుజువై వారి సభ్యత్వం రద్దవడం వంటి సంఘటనలు మన ప్రజాప్రతినిధులు నైతికంగా ఎంతకు దిగజారారో తెలియజేస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తొలిరో జుల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేవారు ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తే, ఇప్పుడు ఎక్కువమంది డబ్బు సంపాదించు కోవ డానికి, అధికారం చలాయించడానికి, సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలు ఒక వృత్తిగా, ధనార్జన సాధనంగా మారాయి.
 • లోపభూయిష్టమైన ఎన్నికల విధానం కూడా శాసన శాఖ క్షీణతకు దోహదం చేస్తోంది. బహుపార్టీ వ్యవస్థ ఉన్న భారత్ లాంటి దేశాల్లో సాధారణ మెజారిటీ పద్ధతి ప్రజాస్వామ్య భావననే అపహాస్యం చేసినట్లవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధి మెజారిటీ ఓటర్ల చేత ఎంపికవ్వాలి. కానీ కేవలం 20 నుంచి 30 శాతం ఓటర్ల మద్దతు పొందిన అభ్యర్థి ఎన్నికల్లో గెలుస్తున్నారు. కారణం.. ఒక నియోజక వర్గంలో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు బలంగా ఉన్న ప్పుడు ఓట్లు వాటి మధ్య చీలిపోతాయి. మిగిలిన వాటికంటే కొద్దిగా మెరుగైన పార్టీ (కొన్ని సందర్భాల్లో కేవలం 2, 3 ఓట్ల తేడాతో) గెలుస్తుంది. గెలిచిన అభ్యర్థి ఆ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తారే తప్ప మెజారిటీ ఓటర్లకు కాదు. అలాంటి ప్రతినిధి నిజంగా ప్రజాప్రతినిధి కాలేడు. ఈ విధానం కులతత్వాన్ని, మతతత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఒక నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక కులానికి/మతానికి చెందినవారు 20-30 శాతం ఓటర్లుంటే ఆ కులానికి చెందిన అభ్యర్థి గెలవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. వేరే కులాలకు, మతాలకు చెందిన ఓటర్లు ఆ ప్రతినిధిని తమ ప్రతినిధిగా చూడలేకపోతున్నారు. ఆ ప్రతినిధి వ్యవహరించే తీరు కూడా అలానే ఉంటుంది. తరచుగా మన ప్రతినిధులు పార్టీలు ఫిరాయిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలోని లొసుగులు, దానిని అమలుపరిచే సభాధ్యక్షుల పక్షపాత వైఖరి ఓటర్ల విశ్వాసాన్ని వమ్ము చేసే ప్రతినిధులపై కొరడా ఝళిపించకుండా చేస్తుంది.
 • బాధ్యతారహితంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులను 'పునరాయన' (రీకాల్) రూపంలో శిక్షించవచ్చు. అంటే అలాంటి ప్రతినిధు లను ఓటర్లు వెనక్కి పిలిచే అవకాశం. పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల్లో ఈ పద్ధతిని ప్రభావవంతంగా పాటిస్తున్నారు. భారత్ లాంటి దేశాలలో ఇది ఆచరణలో లేదు. ఎన్నికైన తర్వాత తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీ తనం లేకుండా చేస్తుంది.
 • ప్రస్తుత ఎన్నికల విధానం వ్యయంతో కూడుకుంది. గట్టి పోటీని ఎదుర్కొనే అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేయడానికి కోట్ల రూపా యలు ఖర్చు పెడుతున్నారు. గెలిచిన వ్యక్తి ఆ డబ్బును రాబట్టుకోవడానికి అన్ని రకాల అనైతిక చర్యలకు పాల్పడుతు న్నారు. అంతేకాక బడా పారిశ్రామిక వేత్తలు ఎన్నికల్లో అభ్యర్థులకు దండిగా ధన సహాయాన్ని అందించి ఎన్నికైన అభ్యర్థులను తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. జాతి ప్రయోజనాల స్థానంలో వర్గ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తాము ప్రజా ప్రతినిధులమనే విషయాన్ని మర్చిపోతున్నారు. సగటు పౌరుడి ఇక్కట్లు పట్టించుకునే ప్రతినిధులు కరవయ్యారు.

శాసనశాఖను పటిష్టం చేయడానికి సూచనలు

 • మన దేశంలో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, మేధావి వర్గాలు ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలను ప్రతి పాదించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సాధారణ మెజారిటీ పద్ధతి స్థానంలో ప్రత్యేక మెజారిటీ విధానం (గెలిచిన అభ్యర్థికి పోలైన ఓట్లలో 50% కంటే ఎక్కువ రావాలి) లేదా బహుసభ్య నియోజకవర్గ విధానాన్ని అమలుచేయాలి. బహుసభ్య నియోజకవర్గ విధానం వల్ల ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల్లో పోలైన ఓట్ల ఆధారంగా (నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం) స్థానాలు నిర్ణయమవుతాయి. ఈ విధానంలో ఒక పార్టీ నష్టపోవడం ఇంకొక పార్టీ లబ్ది పొందడం ఉండదు. శాసనశాఖ ప్రజాభీష్టాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
 • ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించినట్లయితే రాజకీయ పక్షా లు, వీటి అభ్యర్థులు ధనికులు, వ్యాపార సంస్థల మీద ఆధారపడా ల్సిన పరిస్థితి ఉండదు. స్వతంత్రంగా నీతి నిజాయితీతో బాధ్యతలను నిర్వహించే అవకాశముంటుంది. ధన ప్రభావాన్ని తగ్గించడానికి వీలవుతుంది.
 • పునరాయన పద్ధతి ప్రజాప్రతినిధుల్లో జవాబుదారితనాన్ని పెంపొం దిస్తుంది. సగటు పౌరుని సాధికారతకు దోహదం చేస్తుంది.
 • నేరచరితులను పోటీకి అనర్హులుగా ప్రకటించడానికి వీలుగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలి.
 • ప్రధాన రాజకీయ పక్షాల మధ్య నేరచరితులకు టిక్కెట్లు నిరాకరించే విషయంలో ఏకాభిప్రాయం కుదరాలి.
 • సభా సమావేశ కాలాన్ని పొడిగించాలి. సంవత్సరంలో కనీసం 150 రోజులు సమావేశాలు జరగాలి.
 • సభా కార్యక్రమాలకు అనవసర అంతరాయం కలిగించకుండా ఉండటానికి ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలుపరచాలి. ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలి.
 • అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరి ప్రజాప్రతినిధులు తమ బాధ్య తలను మరింత ప్రభావవంతంగా నిర్వహించాలంటే వారికి తగిన రాజకీయ పాలనా పరిజ్ఞానం కావాలి. పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత నిబంధన విధించాలి. ప్రతినిధులకు ప్రధాన సమస్యల మీద సమాచారాన్ని అందించడానికి నిపుణులను సహాయకులుగా నియమించాలి.
 • పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను తొలగించి ఫిరాయిం పులకు పాల్పడ్డ వారికి ఎలాంటి రాజకీయ లబ లభించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
 • ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు, పౌర సమాజం చురుకుగా వ్యవహరించినప్పుడే రాజకీయ ప్రక్షాళన వీలవుతుంది. బ్రెస్ అనే పండితుడు అభిప్రాయపడినట్లు 'నిరంతర అప్రమత్తత స్వేచ్ఛకు చెల్లించే మూల్యం'.

Close