-->

ప్రాచీన చరిత్ర - తెలంగాణ చరిత్ర - శాతవాహనుల చరిత్ర - Ancient History - History of Telangana - History of the Satavahanas

Also Read


ప్రాచీన చరిత్ర

తెలంగాణ చరిత్ర శాతవాహనుల చరిత్ర కంటే ప్రాచీనమైంది. క్రీ. పూ. 6వ శతాబ్దంలో విలసిల్లిన షోడశ మహా జనపదాల్లో తెలంగాణ ఒకటి. ఇది నేటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతం. దీనికి అప్పట్లో అస్మక లేదా అస్యక రాజ్యం అనే పేరుండేది. ఈ రాజ్యానికి రాజధాని పోదన (బోధన్). దీని పాలకుడు సుజాతుడుగా భావిస్తారు. ఈయన గౌతమ బుద్ధుడికి సమకాలికుడు.
    భారతదేశ ప్రజల్లోని అతి ప్రాచీనుల్లో తెలంగాణ ప్రజలు ఒకరు. తెలంగాణ చరిత్రను అధ్యయనం చేయడానికి అనేక ఆధారాలు లభిస్తున్నాయి. నేటి జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల గ్రామంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. శాతవాహనులకు పూర్వమే కోటిలింగాలలో మట్టికోట ఉందని, ఈ ప్రాంతాన్ని గోభద, కంవాయ, నరన, సమగోపులనే స్థానిక రాజులు పాలించారని అక్కడ లభించిన నాణేలను బట్టి తెలుస్తోంది. ఈ నాణేలను పరిశీలించిన డా. ఎన్.ఎస్. రామచంద్రమూర్తి, పి.వి. పరబ్రహ్మశాస్త్రి, డా. దేమో రాజారెడ్డి మొదలైనవారు శాతవాహనులకు పూర్వం కోటిలింగాలను రాజధానిగా చేసుకుని స్థానిక రాజులు పాలించారని, శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు పైన పేర్కొన్న సమగోపుడి కొలువులో ఉండి, తర్వాత స్వతంత్రుడై, కోటిలింగాల నుంచి పాలన ప్రారంభించాడని పేర్కొన్నారు.
 • గ్రీకు రాయబారి మెగస్తనీసు రచించిన 'ఇండికా' గ్రంథంలో పేర్కొన్న 30 కోట గోడల నగరాల్లో అస్మక జనపదం ఒకటని గుర్తించారు.
 • శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, మహేంద్రగిరి ప్రాకారంగా ఉన్న దేశాన్ని త్రిలింగ దేశంగా స్కంద పురాణం పేర్కొంది. త్రిలింగణా అనే శబ్దం మారి తెలంగాణెము, తెలంగాణముగా వ్యవహారంలోకి వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం.
 • తెలంగాణ అంటే తెలుగు వారుండే దేశమని అర్థం. ఇది ప్రాచీన పదం. తెలంగాణ తొలి రాజధాని కోటిలింగాల. నన్నయ్య ఆదిపర్వంలో తెలింగ ప్రాంతాన్ని పేర్కొన్నాడు. దేవగిరిని పాలించిన యాదవ రాజుల మంత్రి హేమాద్రి రచించిన 'ప్రతఖండం' అనే గ్రంథంలో కాకతీయ రాజు రుద్రదేవుడిని త్రిలింగ అధిపతిగా, ఆంధ్ర మహారాణిగా వర్ణించాడు.
 • మొగలుల ఆస్థాన కవి అబుల్ ఫజల్ తన రచనల్లో తెలంగాణ గురించి ప్రస్తావించాడు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో లభించిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో 'తెలుంగణ' పదాన్ని ప్రస్తావించారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వేయించిన చిన్నకంచి (1917), తిరుమల (1917) శాసనాల్లో తెలంగాణ ప్రస్తావన కనిపిస్తుంది.
 • చరిత్రకారులు మానవ చరిత్రను చారిత్రక పూర్వయుగం, చారిత్రక యుగం అని రెండు భాగాలుగా విభజించారు. మానవుడు చదువు నేర్చుకోక ముందున్న యుగాన్ని చారిత్రక పూర్వ యుగమని, చదువు నేర్చుకున్న తర్వాత చారిత్రక యుగమని పేర్కొన్నారు. పలువురు భూగర్భ శాస్త్రవేత్తలు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో చారిత్రక పూర్వ యుగం నాటి అవశేషాలను కనుక్కున్నారు.
 • మెడోస్ టేలర్ నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి వద్ద బృహత్ శిలాయుగ అవశేషాలను కనుక్కున్నాడు. ఎఫ్. ఆర్.వి, ఆల్ చిన్, పి.శ్రీనివాస్ మహబూబ్ నగర్ జిల్లాలోని ఉట్నూరులో జరిపిన పరిశోధనల్లో పేడను కాల్చిన బూడిద రాశులను కనుకున్నారు.
 • కాగ్లిన్ బ్రౌన్ అనే వ్యక్తి భద్రాచలంలో 50 గజాల విస్తీర్ణంలో 35 రకాల ప్రాచీన శిలాయుగ పనిముట్లను గుర్తించాడు. బి. ఆర్. సుబ్రహ్మణ్యం నాగార్జున కొండ వద్ద ఉన్న ఏలేశ్వరంలో చారిత్రక పూర్వయుగ అవశేషాలను, ఎస్. ఎస్. రావు 1966లో నల్లగొండ జిల్లా మూసీనది లోయలో శిలాయుగ అవశేషాలను కనుక్కున్నారు.

శాతవాహనులు

    తెలంగాణ, తెలుగు ప్రాంతాలను పాలించిన శాతవాహనులు తొలి గొప్ప పాలకులు. వీరు మౌర్యులకు సామంతులుగా వ్యవహరించారు. వీరి కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. శాతవాహనులు క్రీ. పూ. 230 నుంచి క్రీ.శ.223 వరకు పాలించినట్లు తెలుస్తోంది. వీరి చరిత్రకు సంబంధించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
 • శాతవాహనుల జన్మస్థలం గురించి చరిత్రకారులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
 • శాతవాహనులు విదర్భ ప్రాంతం వారని వి.వి.మిరాశీ తెలిపారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన వారని వి.ఎస్. సుక్తంకర్ అభిప్రాయం. అయితే వీరు ఆంధ్రదేశానికి చెందిన వారని రాప్సన్, విన్సెంట్ స్మిత్, బండార్కర్, గుత్తి వెంకట్రావు పేర్కొన్నారు.
 • శాతవాహనులు తెలంగాణ ప్రాంతం వారని డా. పి.వి. పరబ్రహ్మ శాస్త్రి పేర్కొన్నాడు. శాతవాహనులు ఆంధ్రులు కారని, వారి భృత్యులని వి.ఎస్.సుక్తంకర్, శ్రీనివాసశాస్త్రి మొదలైన పండితులు అభిప్రాయపడ్డారు.
 • పురాణాల ప్రకారం 30 మంది శాతవాహన రాజులు 450 సంవత్సరాలు పాలించారు.

శ్రీముఖుడు

    శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు. నేటి జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో తన పాలనను ప్రారంభించాడు. ఈయన కాలం నాటి నాణేలు కోటి లింగాలలో లభించాయి. ప్రారంభంలో జైనమతాన్ని అనుసరించిన ఈయన తర్వాతి కాలంలో తన రాజ్య భద్రత దృష్ట్యా హిందూ మతంలోకి మారిపోయాడు. శ్రీముఖుడు తన కుమారుడైన మొదటి శాతకర్ణికి మహారాష్ట్రను పాలిస్తున్న మహారథి వంశానికి చెందిన దేవి నాగానికతో వివాహం జరిపించాడు.

మొదటి శాతకర్ణి

 • మొదటి శాతకర్ణి తొలి శాతవాహనుల్లో గొప్పవాడు. ఈయన మరణానంతరం భార్య దేవి నాగానిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. ఈ శాసనంలో నాగానిక మొదటి శాతకర్ణిని 'దక్షిణాపథపతి' అని వర్ణించింది. ఈయన సాధించిన విజయాలను పేర్కొంది.
 • మొదటి శాతకర్ణి కళింగ పాలకుడైన ఖారవేలుడిని ఓడించినట్లు చుళ్ల కళింగ జాతకం ద్వారా తెలుస్తోంది.

హాలుడు

 • శాతవాహనుల్లో 17వ రాజైన హాలుడు గొప్ప కవి, సారస్వతాభిమాని. ఈయనకు 'కవి వత్సలుడు' అనే బిరుదు ఉంది. హాలుడు 'గాథా సప్తశతి' అనే గ్రంథాన్ని రచించాడు.
 • హాలుడు సింహళ రాజకుమారి లీలావతిని ప్రేమించినట్లు, వీరి వివాహం సప్త గోదావరి ప్రాంతంలో ఉన్న ద్రాక్షారామంలో జరిగినట్లు కుతుహలుడు తన 'లీలావతి కావ్యం'లో పేర్కొన్నాడు.

గౌతమీపుత్ర శాతకర్ణి

 • గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో 23వ రాజు. ఇతడు శాతవాహనులందరిలో గొప్పవాడు. ఇతడి తల్లి గౌతమీ బాలశ్రీ. కుమారుడి విజయాలను, గొప్పతనాన్ని పొగుడుతూ, అతడి మరణానంతరం నాసిక్ శాసనాన్ని వేయించింది.
 • ఇతడి కాలం నుంచే రాజులు తమ తల్లుల పేర్లను తమ పేర్లకు ముందు ధరించే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ విధంగా మాతృసంజ్ఞలను వాడిన మొదటి శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి.
 • మూడు సముద్రాల పర్యంతం సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన ఇతడు 'త్రిసముద్రతోయ పీతవాహన' అనే బిరుదు పొందాడు. అశ్వాలు మూడు సముద్రాల నీళ్లు తాగేవని ప్రతీతి.
 • ఇతడి ఇతడికి ఏకబ్రాహ్మణుడు, ఆగమ నిలయుడు, క్షత్రియ దర్పమాన మర్దనుడు, ఏకశూరుడు అనే బిరుదులు ఉన్నాయి.
 • నాగార్జునకొండలో ఇతడి కాలం నాటి నాణేలతోపాటు నాణేలు ముద్రించే దిమ్మెలు కూడా దొరికాయి.

యజ్ఞశ్రీ శాతకర్ణి

 • ఇతడు శాతవాహనుల్లో చివరి గొప్ప పాలకుడు.ఇతడు పురాణాల్లో 26వ వాడు.
 • రెండు తెరచాపలున్న ఒక బొమ్మ నాణేలు ఇతడి కాలులో జరిగిన విదేశీ నాకా వ్యాపారాభివృద్ధిని తెలియజేస్తున్నాయి.
 • బాణుడు తన 'హర్షచరిత్ర గ్రంథంలో యజ్ఞశ్రీ శాతకర్ణిని 'త్రిసముద్రాధీశ్వర' అని పేర్కొన్నాడు.
 • బౌద్ధమతంలో మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించిన ఆచార్య నాగార్జునుడిని ఆదరించిన యజ్ఞశ్రీ ఆయనకు నాగార్జునకొండలో పారావతమహారాన్ని నిర్మించి ఇచ్చాడు. యజ్ఞశ్రీ కోసం ఆచార్య నాగార్జునుడు 'సుహృల్లేఖ' అనే గ్రంథాన్ని రచించాడు.

మూడో పులోమావి

 • ఇతడు చివరి శాతవాహన పాలకుడు. ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడైన శాంతమూలుడు మూడో పులోమావిని తరిమేసి, ధాన్యకటక ప్రాంతాన్ని ఆక్రమించాడు.
 • కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి వెళ్లిన మూడో పులోమావి కొంతకాలం పాలించాక, అక్కడే మరణించాడు. 
 • ఇతడి శాసనం బళ్లారి జిల్లా మ్యాకదోనిలో దొరికింది. ఈ శాసనం శాతవాహన రాజ్య పతనాన్ని తెలియజేస్తుంది.

వాణిజ్యం

 • దేశీయ వాణిజ్యం గురించి అమరావతి శాసనం తెలియజేస్తుంది. గూడూరు ప్రాంతంలో సన్నదుస్తులు, లేతదుస్తులు, వినుకొండ ప్రాంతంలో లోహ పరిశ్రమ, పల్నాడులో వజ్ర పరిశ్రమ ప్రసిద్ధి చెందాయి. యజ్ఞశ్రీ శాతకర్ణికి చెందిన 12 ఓడ నాణేలు గుంటూరు జిల్లా చేబ్రోలులో లభించాయి. రోమ్ దేశంతో వాణిజ్యం బాగా సాగేది. రోమ్ నాణేలు సూర్యాపేట, ఏలేశ్వరం, నాగార్జున కొండ లాంటి చోట్ల లభించాయి. వర్తక వ్యాపారం వస్తు మార్పిడి (బార్టర్) పద్దతిలో జరిగేది.
 • వర్తకులు తమ సౌకర్యం కోసం చిహ్నముద్ర నాణేలు (Punch Marked Coins) ముద్రించేవారు.
 • శాతవాహనులు సీసం, పొటిన్, రాగి, వెండి నాణేలు ముద్రించారు. కర్షపణాలు అనే వెండి నాణేలు, సువర్ణాలు అనే బంగారు నాణేలు ఉండేవి. ఇంకా కుశనం, పచక లేదా ప్రతీక అనే నాణేలు ఆ కాలంలో వాడుకలో ఉండేవి. 

పరిపాలన

 • శాతవాహన రాజ్యం కేంద్రీకృతమైంది కాదు. వీరి సామంతులు కూడా తమ చక్రవర్తిలా మాతృసంజ్ఞలను ధరించి, నాణేలు ముద్రించే అధికారం ఉన్నవారు. వీరి కాలంలో పితృస్వామ్య వ్యవస్థ ఉండేది.
 • శాతవాహనులు పరిపాలనా సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని ఆహారాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. ఆహారంపై అధిపతి అమాత్యుడు. గ్రామానికి అధికారి శ్రామికుడు, గ్రామణి, గుమిక. అనేక గ్రామాలను కలిపి గుల్మి అని, దీని అధిపతిని గుల్మికుడు అని పిలిచేవారు. గుమిక అధికారులు కొన్ని గ్రామాల్లో ఉండేవారు. శాంతి భద్రతల పరిరక్షణ వీరి ముఖ్య బాధ్యత.
 • వర్తక పట్టణాల పరిపాలనకు నిగమ సభలు ఉండేవి. ఈ విషయం భట్టిప్రోలు శాసనం ద్వారా తెలుస్తోంది. వాటిలో రాజు భాగానికి దేయమేయం, రాజభాగం అనే పేర్లు ఉండేవి. రాజు సొంత భూమిని రాజక్షేత్రం (రాజ కంఖేట) అనేవారు.
 • వృత్తి పన్నులను కరుకర అనేవారు. ఈ కాలంలో వివిధ వృత్తి సంఘాలు ఉండేవి. 
 • ఈ కాలంలో వడ్డీ వ్యాపారులు 12% వడ్డీ వసూలు చేసేవారని శకక్షత్రపుడు రుషభదత్తుడి నాసిక్ శాసనం ద్వారా తెలుస్తోంది.
 • గ్రామంలోని రైతులతో బంజరు భూములను ఉచితంగా సేద్యం చేయించి, ఆదాయాన్ని రాజుకు పంపేవారు. ఇలాంటి ఉచిత సేద్యానికి విష్టి అని పేరు. శాతవాహనుల కాలంలో పొలాలకు నీటిని సరఫరా చేయడానికి ఉదక యంత్రాలను, పత్తిగింజలు తీయడానికి రక్కసిలొటొయి గిరక అనే సాధనాన్ని వాడేవారు.

నాటి వృత్తులు - వృత్తి సంఘాలు

హాలికులు

వ్యవసాయదారులు

సేధీ

వ్యాపారులు

కొలికులు

సాలె (దుస్తులను నేసేవారు)

గోపాలక

గోవులను కాసేవారు

తిలపిష్టకులు

తెలికెవారు (నూనె తీసేవారు)

సేల వర్ధకులు

శిల్పులు 

ఒద యంత్రికులు

నీటి యంత్రాలను నడిపేవారు

వసకరులు

మేదర వారు

సార్ధవాహులు

విదేశీ వర్తకం చేసేవారు

వదకులువదకులు

వడ్రంగులు

కాసకారులు

కంచు పని చేసేవారు

కమారులు

కమ్మరులు

కులారులు

కుమ్మరులు

గధికులు

సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవారు

సువనక

బంగారం పనులు చేసేవారు

చంకుకారులు

చర్మకారులు

లేఖకులు

రాయసగాండ్రు

మణికారులు

రాయి మెరుగు పెట్టేవారు

Close