-->

ఆర్ధిక సమస్యలు ఏవిధంగా ఏర్పడతాయి? వనరులు పుష్కలంగా ఉంటే ఆర్ధిక సమస్యలుంటాయా? - What are the financial problems? Will there be financial problems if the resources are plentiful?

Also Read

   
    ప్రతి ఆర్ధిక వ్యవస్థ పరిమిత వనరులు కల్గి ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో సహితం అధిక వనరులుంటాయి కానీ, అపరిమిత వనరులుండవు. కాబట్టి ప్రతి ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొనే ఎంపిక సమస్య వనరుల కొరతకు సంబంధించినది. అందువలన వనరుల కొరత వలన ఏర్పడే సమస్యలు ప్రధాన సమస్యలుగా భావిస్తారు.
ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొనవలసిన ప్రధాన సమస్యలు మూడు రకాలు అవి
  • (i) ఏ ఏ వస్తు సేవలు ఎంతెంత పరిమాణంలో ఉత్పత్తి చెయ్యాలి. 
  • (ii) ఏ విధంగా ఉత్పత్తి చెయ్యాలి. 
  • (iii) ఎవరికోసం ఉత్పత్తి చెయ్యాలి. 

i) ఏ ఏ వస్తుసేవలు ఎంతెంత పరిమాణంలో ఉత్పత్తి చెయ్యాలి

    ప్రతి ఆర్ధిక వ్యవస్థ ఆధీనంలో ఉన్న వనరులు పరిమితం కాని అది ఉత్పత్తి చెయ్యవలసిన వస్తు సేవలు మాత్రం అపరిమితాలు. ఏ ఆర్ధిక వ్యవస్థ తనకున్న పరిమిత వనరులతో తన ప్రజలకు కావలసిన అన్ని వస్తు సేవలు ఉత్పత్తి చెయ్యలేదు. అందువలన ఏ ఏ వస్తు సేవలు ఎంతెంత పరిమాణంలో ఉత్పత్తి చెయ్యాలనే సమస్య ఎదురవుతుంది. అనగా వనరుల కేటాయింపు సమస్య ఎదురవుతుంది. అందుబాటులో ఉన్న వనరులను, ఏరకమైన వస్తు సేవల సముదాయాలు ఉత్పత్తి చెయ్యాలో నిర్ణయించడం కూడా ఎంపిక సమస్యే. ఈ విధంగా ఏవి ఉత్పత్తి చెయ్యాలి ఎంతెంత ఉత్పత్తి చెయ్యాలి అనే సమస్య వనరుల కేటాయింపు పైన, వాటికున్న ప్రత్యామ్నాయ ప్రయోజనాల పైన ఆధారపడి ఉంటుంది.

ii) ఏ విధంగా ఉత్పత్తి చెయ్యాలి

    ఏవిధంగా ఉత్పత్తి చెయ్యాలి అనేది ఉత్పత్తి పద్దతుల ఎంపికకు సంబంధించినది. ఉత్పత్తి పద్ధతులు అనగా ఏ ఏ ఉత్పత్తి కారకాలు ఎంతెంత నిష్పత్తిలో వస్తుసేవల ఉత్పత్తిలో పాలు పంచుకొంటున్నాయో తెలుసుకోవడం. సాధారణంగా వస్తు సేవలను అనేక రకాలుగా ఉత్పత్తి చేస్తారు. శ్రమ మూలధనాలను వివిధ అనుపాతాలలో మిళితం చేస్తూ వస్త్రం ఉత్పత్తి చెయ్యవచ్చును. పెద్ద పెద్ద యంత్రాలు ఉపయోగించి, తక్కువ శ్రామికులను వినియోగించి వస్త్రాలు ఉత్పత్తి చేస్తే దానిని మూలధన సాంద్రిత పద్ధతుల ద్వారా ఉత్పత్తి అంటారు. ఒక వేళ యంత్రాలను ఉపయోగించకుండా ఎక్కువ మంది శ్రామికులను నియమించి చేతితో వస్త్రాలు తయారు చేసినట్లయితే దానిని శ్రమ సాంద్రిత ఉత్పత్తి అంటారు.
    ప్రతి ఆర్ధిక వ్యవస్థలోను ఉత్పత్తి పద్దతుల ఎంపిక సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణం శ్రమ మూలధనాలు పరిమితంగా లభ్యం కావడమే. ఏ ఆర్ధిక వ్యవస్థ అయినా పరిమిత వనరులు సద్వినియోగం చేసుకుంటూ వివిధ వస్తు సేవలు ఉత్పత్తి చెయ్యడానికి తగిన ఉత్పత్తి పద్ధతులను ఎంపిక చేసుకుంటుంది.

iii) ఎవరికోసం ఉత్పత్తి చెయ్యాలి.

    ప్రతివ్యక్తి తనకు కావలసిన అన్ని వస్తువులను పొందలేడు. ఆర్ధిక వ్యవస్థలో జరిగిన ఉత్పత్తి అందరి కోర్కెలు తీర్చలేదు. అందుచేత ఎవరు ఎంతెంత పంచుకోవాలి అనే ప్రశ్న ఏర్పడుతుంది. ఆర్ధిక వ్యవస్థలో వివిధ వర్గాల మధ్య ఎంతెంత వస్తురాశి ఏ విధంగా సర్దుబాటు చెయ్యాలో తెలిపేదే పంపిణీ సమస్య.

ఇతర సాధారణ సమస్యలు

పైన వివరించిన ప్రధాన సమస్యలతో పాటు ఆర్ధిక వ్యవస్థలోని మరికొన్ని సాధారణ సమస్యలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది.

(i) వనరుల సంపూర్ణ వినియోగిత

వనరుల కొరత కారణంగా వాటిని సంపూర్ణంగానూ, సమర్ధవంతముగానూ ఉపయోగించవలసి ఉంటుంది.

ఎ) వనరులన్నీ సంపూర్ణంగా వినియోగించుట

    ఏ వనరు నిరుపయోగంగా లేదా వాడకుండా ఉండటం కానీ ఉండరాదు. ఏ వనరైనా వాడకుండా ఉంటే అది వృధా అవుతుంది. కాబట్టి అన్ని వనరులు సంపూర్ణంగా ఉపయోగించుకొంటే వస్తుసేవల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది.

బి) వనరులు సమర్ధవంతంగా వినియోగించుట

    కొరతగా ఉన్న వనరులను సాధ్యమైనంత సమర్ధవంతముగా వినియోగించుకోవాలి. వనరులు సమర్ధవంతంగా వినియోగించటం అనగా మరి ఏ ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా కూడా సాధించ లేనంత గరిష్ట ఉత్పత్తిని ప్రస్తుత పద్ధతిలో సాధించటం అని అర్ధం. ప్రతి ఆర్ధిక వ్యవస్థ కొరతగా ఉన్న వనరులను సమర్ధవంతంగా వినియోగించడానికి ప్రయత్నిస్తుంది.

(ii) వనరుల అభివృద్ధి

    ఎక్కువ వస్తూత్పత్తికి ఎక్కువ వనరులు అవసరం. అందువలన అదనపు వస్తూత్పత్తికి అదనపు వనరులు అవసరమౌతాయి. ఆర్ధిక వ్యవస్థలో ఎన్ని ఎక్కువ వనరులు లభ్యమయితే, అంత ఎక్కువ వస్తురాశి ఉత్పత్తి సాధ్యపడుతుంది. కనుక ప్రతి ఆర్ధిక వ్యవస్థకు ప్రస్తుత సమస్య అదనపు వనరుల సమీకరణ. ఈ విధంగా ప్రతి ఆర్ధిక వ్యవస్థ ఆర్ధిక సమస్యల వేదికగా మారింది. ఈ ఆర్ధిక సమస్యలకు మూలకారణం వనరుల కొరత.

Close