-->

స్వామి వివేకానంద చెప్పిన సంకల్ప శక్తి అంటే ఏమిటి? What is will power?)

Also Read

సంకల్ప శక్తి అంటే ఏమిటి?
ఒట్టు పెట్టడంలోనూ, క్షణమైనా  గడవకముందే ఆ ఒట్టును తీసి గట్టుమీద పెట్టడంలోనూ మనం గొప్ప ప్రావీణ్యం సాధించాం!! ఒట్టు పెట్టడం సులభమే కానీ దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. భీష్ముడికి ఉన్నటు వంటి సంకల్పశక్తి మనకు కావాలి. ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి, దాన్ని శ్రద్ధతో ఆచరించి చూపాడు. బలహీనమైన మనస్సు ఉండేవాళ్ళు ఏవో కుంటిసాకులు చెప్పడానికి చూస్తారు. మనస్సు చంచలమైనది. స్వాభావికంగా అశాంతిగా ఉంటుంది. ఎప్పుడూ ఊగిసలాడుతూ, క్షణానికి ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎవరైతే దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారో, గొప్ప పనుల్ని సాధించాలన్న దృఢనిశ్చయాన్ని ఏర్పరుచుకుంటారో వాళ్ళు తమ మనస్సులు చెప్పేది వినరు. వాళ్ళు తమ మనస్సులకే యజమానులు. జీవితంలో ఉన్నత విషయాలను సాధించడం కోసం వాళ్ళు తాము చెప్పినట్టు తమ మనస్సులచేత పని చేయించుకోగలరు. మహారాజు అయిన విశ్వామిత్రుడు గర్విష్టి. బ్రహ్మర్షి అయిన వశిష్టుణ్ణి రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నాలు ఫలించక భంగపడ్డాడు. వశిష్టుడి వద్ద ఉన్నది ఆధ్యాత్మిక శక్తి అని గ్రహించి తాను కూడా తపస్సు చేసి బ్రహ్మర్షి కావాలని నిశ్చయించుకున్నాడు. కానీ మేనక అతణ్ణి ఆకర్షించి నప్పుడు కామసుఖాల వలలో చిక్కుకుపోయాడు. బ్రహ్మర్షి స్థితిని సాధించడం కోసం కోపం, ద్వేషం, అసూయ, గర్వం, ఈర్ష్య, భ్రమలు మొదలైన అడ్డంకులన్నీ దాట వలసి వచ్చింది. అయితే ఆయన తన అమోఘమైన సంకల్పశక్తి వల్లనే విజయం సాధించాడు. ఓటమి పాలయ్యానని ఆయన ఎప్పుడూ తన గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. ఆయన యొక్క దృఢనిశ్చయం, దృఢ సంకల్పం ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలిపి, గెలుపుబాటలో నడిపించాయి. “నేను బలహీనుణ్ణి అని నీవు ఎప్పుడూ చెప్పకూడదు. దిగజారుడుతనం లాగా కనిపించే ఆ పైపొర క్రింద ఎటువంటి గొప్ప శక్తియుక్తులు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు? నీలో ఉన్న అపారమైన శక్తిని గురించి నీకు తెలిసినది చాలా తక్కువ. ఎందుకంటే నీ వెనుక ఆ అనంత శక్తి సముద్రం, ఆ ఆనంద సాగరం ఉన్నాయి.”    - స్వామి వివేకానంద

Close