-->

సమాఖ్య ప్రభుత్వం లక్షణాలు (Characteristics of Federal Government)

Also Read

సమాఖ్యప్రభుత్వం లక్షణాలు (Characteristics of Federal Government)

ప్రభుత్వాలు అనేక రకాలు. అధికార విభజన ఆధారంగా ప్రభుత్వాలు రెండు రకాలు అవి

1. ఏకకేంద్ర ప్రభుత్వం

2. సమాఖ్య ప్రభుత్వం.

రాజ్యాంగబద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య అధికార పంపిణీ జరిగినట్లయితే ఆ ప్రభుత్వ విధానాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటారు.

అర్ధం: సమాఖ్యను ఆగ్లంలో 'Federation' అంటారు. ఫెడరేషన్ అనే ఆంగ్లపదం 'Foedus' అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. 'ఫోడస్' అనగా ఒప్పందం లేదా అంగీకారం. కావున సమాఖ్య అనేది ఒక ఒప్పందం ఫలితంగా ఏర్పడుతుంది.

సమాఖ్యకు కారణాలు: సమాఖ్య వ్యవస్థ రెండు కారణాలవలన ఏర్పడుతుంది.

1. ఆర్ధికంగా, సైనికంగా బలహీనంగా ఉన్న చిన్న రాజ్యాలు ఉమ్మడి ప్రయోజనాలకోసం ఒక ఒప్పందం ద్వారా సమాఖ్య ఏర్పడవచ్చు.

2. భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలుగల రాజ్యంలో రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తూ కేంద్రప్రభుత్వం ఉండటం మరొక కారణం.

CFస్ట్రాంగ్ అభిప్రాయంలో

సమిష్టి ప్రయోజనాలకోసం సమానహోదా ఉన్న కొన్ని రాజ్యాలు సమాఖ్య రాజ్యంగా అవతరిస్తాయి.

 

నిర్వచనాలు:

KC వేర్ అభిప్రాయంలో

జాతీయ ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగి, వాటి అధికారపరధిలో నిర్ణయాలు తీసుకొని, ఆయాప్రభుత్వాలు వ్యవహరించే విధానమే సమాఖ్య"

JW గార్నర్ అభిప్రాయంలో

ఒక సార్వభౌమ వ్యవస్థలో రాజ్యాంగం ద్వారా లేదా పార్లమెంటు రూపొందించిన చట్టాలద్వారా సంక్రమించిన అధికారాల ద్వారా కేంద్ర, స్థానిక ప్రభుత్వాలు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగివుండే ప్రభుత్వ పద్ధతే సమాఖ్య".

హామిల్టస్ అభిప్రాయంలో

విభిన్న స్వతంత్ర రాజ్యాల కలయిక ఏర్పడిన నూతన రాజ్యస్వరూపమే సమాఖ్య రాజ్యం".

AV డైసీ అభిప్రాయంలో

జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కుల సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య రాజ్యం".

 

సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు (Characteristics of Federal Government)

1. అధికారవిభజన (Division of Powers):

సమాఖ్యలో అత్యంత ముఖ్య లక్షణం రాజ్యాంగబద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య అధికారాలను విభజించడం. జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై కేంద్రప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. EX. దేశరక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, జాతీయ రహదారులు, రైల్వేలు etc.

ప్రాంతీయ ప్రాధాన్యతగల అంశాలపై రాష్ట్రప్రభుత్వానికి అధికారాలుంటాయి. EX. వ్యవసాయం, ఆరోగ్యం, రోడ్లు, రవాణా etc.

సమాఖ్య ప్రభుత్వంలో అధికార విభజనకు భారతదేశం, అమెరికా, కెనడా దేశాలను ఉదాహరణగా

చెప్పవచ్చు.

2. రాజ్యాగ ఆధిక్యత (Supremacy of the Constitution):

సమాఖ్య ప్రభుత్వ విధానంలో రాజ్యాంగం అత్యున్నతమైనది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలు, విధులను రాజ్యాంగంలో స్పష్టంగా వివరించబడతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలు రాజ్యాంగపరిధికి లోబడి ఉండాలి.

3. లిఖిత రాజ్యాంగం (Written Constitution):

సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థగల దేశాలలో లిఖిత రాజ్యాంగం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలు, విధులు లిఖిత రూపంలో ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధి స్పష్టంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య వివాదాలు ఏర్పడితే రాజ్యాంగం ఆధారంగా న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి. కావున రాజ్యాంగం లిఖిత రూపంలో ఉండటం సమాఖ్య వ్యవస్థలో ఒక ముఖ్య లక్షణం.

4 దృఢ రాజ్యాంగం (Rigid Constitution):

సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థలో దృఢ రాజ్యాంగం అతిముఖ్య లక్షణం. రాజ్యాంగాన్ని సవరించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం వుండాలి. కేవలం కేంద్రంగాని లేదా కేవలం రాష్ట్రంగాని రాజ్యాంగాన్ని సవరించలేవు. అంతేగాక రాజ్యాంగ సవరణ చట్టం, సాధారణ చట్టంలాగా కాకుండా ప్రత్యేక మెజారిటీతోనే సవరిస్తారు. EX అమెరికా రాజ్యాంగం, భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలు.

5. రెండు స్థాయిలలో ప్రభుత్వాలు (Government at Two Levels):

సమాఖ్యలో రెండు స్థాయిలలో ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, మరొకటి రా ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో దేశ సార్వభౌమాధికారాన్ని, సమైక్యత, సమగ్రతలను పరిరక్షిస్తుంది. రాష్ట్రాలు స్థానిక ప్రాధాన్యత గల ప్రజల అవసరాలను పరిరక్షించడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమానికి రెండూ ముఖ్యం.

6. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సారూప్యత (Similarity between Union and States):

సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు సారూప్యత కలిగి ఉంటాయి. EX. భారతదేశంలో కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలను కలిగి ఉన్నాయి, అమెరికాలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలలో గణతంత్ర రాజకీయ వ్యవస్థలను కలిగి వున్నాయి, అదేవిధంగా స్విట్జర్లాండ్ లో గణతంత్ర రాజ్యవ్యవస్థ ఉంది

7. ద్విసభా విధానం (Bicameralism):

కేంద్రశాసనశాఖలో రెండు సభలు ఉంటాయి. అవి ఎగువ సభ మరియు దిగువ సభ. సాధారణంగా ఎగువసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేగాక ఎగువసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. EX. అమెరికా ఎగువసభ అయిన సెనెట్ లో ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సభ్యులకు ప్రాతినిధ్యం ఉంటుంది. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతుంది.

8. స్వతంత్ర న్యాయశాఖ (Independent Judiciary):

సమాఖ్య వ్యవస్థను రక్షించేది న్యాయశాఖ. కావున రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించి రాజ్యాంగాన్ని, సమాఖ్య వ్యవస్థను, ప్రజల ప్రాధమిక హక్కులను కాపాడటానికి న్యాయ శాఖకు స్వతంత్రత అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శాసనాలు, కార్యనిర్వాహకవర్గం ఉత్తర్వులు రాజ్యాంగపరంగా సరైనవో, కాదో న్యాయశాఖ నిర్ణయిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య వచ్చే వివాదాలను పరిష్కరించే అధికారం న్యాయశాఖకు ఉంటుంది. అంతేగాక కేంద్రం, రాష్ట్రాలు తమ, తమ పరిధిలో వ్యవహరించేటట్లు చూస్తుంది. భారతదేశం, అమెరికా మొదలైన దేశాలలో సమాఖ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని రక్షించే అధికారం సుప్రీంకోర్టుకు కావున సమాఖ్య వ్యవస్థ గల దేశాలలో న్యాయ శాఖ నిర్భయంగా, నిష్పాక్షికంగా, స్వేచ్చగా పనిచేయడానికి కావలసిన స్వతంత్రత న్యాయశాఖకు ఉంటుంది. ఉంది.

9. రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం (Representation to States in Constitutional Amendment Process):

సమాఖ్య వ్యవస్థ లిఖిత, దృఢరాజ్యాంగాన్ని కలిగి రాజ్యాంగాన్ని సవరించాలంటే కేంద్రప్రభుత్వంతోపాటు, రాష్ట్రప్రభుత్వం ఆమోదం కూడా అవసరం. Ex. అమెరికాలో రాజ్యాంగాన్ని సవరించాలంటే కేంద్రంతో పాటు 3/4 వ వంతు రాష్ట్రాల ఆమోదంకూడా అవసరం. భారత రాజ్యాంగం లోని కేంద్ర, రాష్ట్ర సంబందాలను సవరించాలంటే పార్లమెంటులో 2/3 వ వంతు మెజారిటీతో పాటు సగం రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం (ప్రస్తుతం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి).

10. ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship):

సమాఖ్యలో సాధారణంగా ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. జాతీయ స్థాయిలో ఒక పౌరసత్వం, ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర పౌరసత్వం ఉంటాయి. EX అమెరికాలో అమెరికా పౌరసత్వంతోపాటు, ఏ రాష్ట్రంలో నివశిస్తున్నారో ఆ రాష్ట్ర పౌరసత్వం కూడా ఉంటుంది.

 

పైన పేర్కొన్న ప్రాధమిక లక్షణాలతోపాటు భిన్నత్వాన్ని కాపాడుకోవాలనే ఆకాంక్ష, కలిసి ఉండాలనే కోరిక, సమిష్టిగా రక్షణ పొందాలనే ఆశయం సమాఖ్యకు చాలా అవసరం.

Close