-->

అసలు దెయ్యాలు ఉన్నాయా? || నాస్తికులు ఏమి చెప్పుతూ ఉన్నారు

Also Read


        దయ్యాలలో నమ్మకం అంతకంతకు తగ్గుతున్నా, దయ్యాలు అబద్ధమని స్పష్టంగా ప్రజలకు తెలియదు. మరణమంటే శరీరంలో సుంచి జీవుడు బయటకు పోవడమనిన్నీ, ఈ జీవుళ్ళ దయ్యాలు అవుతాయనిన్నీ ఇంకా నమ్మకం ప్రబలంగా ఉంది. బాలింతలు చనిపోతే వారు పేరంటాళ్ళు అయి బంధువులపై ఆవహించుతాయని నమ్మి పేరంటాళ్ళను కొలుస్తారు కూడా. జీవుడు ఉన్నదనుకోవడమే దయ్యాలలో నమ్మకానికి ఆధారం. చావుకి, దయ్యానికి సంబంధం ఉంది. కనుక దయ్యాలు శ్మశాసములలో ఉంటాయనుకుంటారు.
        జీవుడనేది అబద్ధమని స్పష్టంగా తెలుస్తేనే తప్ప దయ్యాలలో సమ్మకం పూర్తిగా పోదు. అందుచేత అసలు జీవుడు ఉందా అని పరిశీలిద్దాం.
        జీవుడు ఉందన్న నమ్మకం అన్ని మతాల ప్రజలలోను చాలా కాలం బట్టి వ్యాపించి ఉండడం నిజం. చిన్నప్పుడు అలవాటైన నమ్మకాలను వదలలేక పెద్ద పెద్ద విజ్ఞానవేత్తలు కూడా జీవుడిని ఏదో విధంగా సమర్ధిస్తారు.
        కాని నిజానికి జీవుడు అనేది అబద్ధం. ప్రపంచాన్ని అర్ధంచేసుకోవడానికి దైవము అనే భావాన్ని మానవుడు కల్పించుకున్నట్లే, కలలను అర్థం చేసుకొనుటకు జీవుడు అనే భావాన్ని కల్పించుకున్నాడు. పరుండినప్పుడు తన దేహములో నుంచి ఒక భాగం బయటకుపోయి, కొత్త కొత్త ప్రాంతాలను చూచిందనీ అది తిరిగి రావడమే నిద్రనుంచి మెలుకువ అనిన్నీ పూర్వము అనుకున్నారు. దేహంలో నుంచి వెలుపలికి పోయి తిరిగి వచ్చిందనుకున్న భాగాన్ని జీవుడు అన్నాడు. శరీరము నిద్రపోయిన సమయంలో జీవుడు పొందిన కొత్త కొత్త అనుభవాలే కలలు అనుకున్నారు.
        శరీరములోనికి జీవుడు తిరిగి రాకపోవడమే మరణమనుకున్నారు. శరీరము విడిచిపోగల జీవుడు ఉన్నదనుకొనుట వలన దయ్యములలో నమ్మకమేకాక, పూర్వజన్మ కర్మ సిద్ధాంతము, స్వర్గ నరకములయందు సమ్మకము, తద్దినములు, అపరక్రియలు మొదలగు ఆచారములు ఏర్పడినవి, కాని జీవుడు అనునది లేనే లేదు.
   జీవుడు లేకపోతే కలలు అర్థం ఏమిటి?
        నిద్రపట్టీ పట్టని సమయంలలో, ఒక విధానము లేకుండా కలగా పులగంగా విహరించు ఆలోచనలే కలలు. ఒక వింత కూర్పు ఉండవచ్చునే కాని కలలలోని ప్రతి విషయమును పరిశీలించగా అవన్నీ కలగన్న వారి అసుభవములలో గాని, ఆలోచనలలో గాని ఉన్నవేనని స్పష్టపడును. గాఢనిద్ర పట్టినప్పుడు ఆలోచనలు ఆగిపోవును. వాటిలో కలలు కూడా ఆగిపోవును. కలల యదార్థం తెలుసుకుంటే జీవుడు లేడని తేలిపోతుంది.
        ఇట్లే మరణమన్నది కూడా అర్థము చేసికొనవచ్చును. మరణము అనగా శరీరతత్వంలోని మార్పు. పసిపిల్లవాడు ఎదుగుచున్న కొద్దీ కొన్ని కొన్ని మార్పులు శరీరములో వస్తూ ఉంటాయి. ఈ మార్పుల పరంపరల వలన అంతకంతకు యవ్వనము, ముసలితనము, మరణము వచ్చును. మరణ దశ తర్వాత కూడా ఈ మార్పులు ముందుకు సాగి పోతూ శరీరము కొయ్య బారటమూ, కుళ్ళిపోవటమూ, శిధిలమైపోవటమూ జరుగుతున్నది. ఇవి అన్నియూ ప్రత్యక్ష విషయములు.

        విషయ జ్ఞాసము లేక ఏది చూచిననూ భయపడు అజ్ఞానావస్థలో మన పూర్వీకులు జీవుడు అను దానిని కల్పించుకొని కలలను మరణమును తప్పుడు విధముగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆ తప్పుడు అర్థమునే అనుసరించినచో అది అభివృద్ధికి ఆటంకమగును. వృద్ధాప్యం, మరణం కూడా శరీరములోని మార్పులవల్ల కలుగుచున్నదని గ్రహించిననాడు ఆ మార్పులను మనము సూక్ష్మముగా అర్ధం చేసుకొని వాటిని వైద్యవిధానముద్వారా అదుపు ఆజ్ఞలలో ఉంచుకొన్న యెడల ముసలితనము, చావు లేకుండా చేసుకొనగలము. జీవుడు కలదను పూర్వ కాలపు నమ్మకము ఇంకనూ వైజ్ఞానికులను పీడించుచుండుటచేత మరణము యొక్క యదార్ధము వారు గ్రహించలేకున్నారు. మరియు యుద్ధమును కోరు రాజకీయవేత్తలకు వైజ్ఞానికులు లోబడిపోయి మారణయంత్రములు తయారు చేయుచున్నారే కాని, మరణమును అరికట్టుటకై ఆలోచించుటలేదు. నాస్తిక దృక్పథం ప్రబలిననాడే ఒక వైపు యుద్ధములను, రెండవవైపున మరణమును కూడా నిస్సందేహముగా ఆపగలుగుదుము.
    జీవుడే లేనప్పుడు దయ్యములు కూడా అబద్ధమే అని తేలిపోపుచున్నది. దయ్యముల గురించి కొంత కొంత మందికి కలుగుచున్న అనుభవములను భయముతో కూడిన మానసిక భ్రాంతులుగా ఋజువు పరచవచ్చు. దయ్యముల పేరిట జరుగు చికిత్స చేతబడులు పూర్తిగా తంత్రములు.
        మానసిక తీవ్రత బలహీనత వలన కలిగిన హిస్టీరియా వ్యాధినే దయ్యము ఆవహించనది అందురు. మానసిక చికిత్సవల్ల ఈ హిస్టీరియాను కుదర్చవచ్చును. దేవతలు, పేరంటాళ్ళు, పూసకములు కూడా హిస్టీరియా వ్యాధులే. వీటిలో అప్పుడప్పుడు కొంత నటన, కొంత మోసము కూడా ఉండును.
        ప్రతివారికి కొన్ని ఆకాంక్షలు, కోరికలు ఉంటాయి. కొందరికి అవి తీరుతాయి. కొందరు వాటిని వ్యక్తిగత మొగమాటముల వలన వెల్లడి చేయలేరు. అట్టి సమయాల్లో అలా దాచి ఉంచబడిన భావం యొక్క తీవ్రత తగ్గిపోతే సరేసరి. లేక దాని తీవ్రత హెచ్చయితే బుద్ధి యొక్క స్వాధీనము తప్పించుకొని అతి ప్రేలుడు గాను, మైమరపుగాను అకస్మాత్తుగా అప్పుడప్పుడు బయటపడును. ఇదే హిస్టీరియా వ్యాధి. తమ రహస్య ప్రేమలను దాచిన స్త్రీలలోను, ఆర్థిక కష్టముల వలన మ్రొక్కుబడులు చెల్లించుకోలేని భక్తులలోను హిస్టీరియా సాధారణంగా వచ్చుచుండును. వీటికే దయ్యములని, దేవతలని పేర్లు పెట్టుచుందురు.

Source - మూఢ నమ్మకాలు - నాస్తిక దృష్టి అనే బుక్ ద్వారా తీసుకోవడం జరిగింది. 

Close