-->

తెలుగు భాషా ఉద్యమ పితామహుడు || చివరి రోజుల్లో... గిడుగు రామ్మూర్తి పంతులు (1863-1940) - Gidugu Rammurty Pantulu

Also Read


గిడుగు రామ్మూర్తి పంతులు (1863-1940) - Gidugu Rammurty Pantulu

భాషా ఉద్యమంలో చిచ్చరపిడుగు గిడుగు రామ్మూర్తి పంతులు, వ్యవహార భాషకోసం  జీవితాంతం కృషి చేసినవారు. తాను నమ్మిన వ్యవ హార శైలికోసం కాకలు తీరిన పండితులను లెక్క చేయని ధీరోదాత్తుడు గిడుగు.

చేసింది బడిపంతులు ఉద్యోగమే కావచ్చు, ఆయన కార్యస్థానం వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతమే అయి ఉండవచ్చు. కాని గిడుగు సాధించినవన్నీ మహాద్భుతాలే. ఒక జీవితకాలంలో అంత గొప్ప భాషా ఉద్యమాన్ని నడపగలగటం గిడుగుకే చెల్లింది. గిడుగువారిది కృష్ణాతీరం నుండి కోనసీమ మీదుగా ఉత్తరాంధ్ర చేరిన కుటుంబం. తండ్రి కాలం చేయ టంతో గిడుగు చదువు క్రమంగా సాగలేదు.

స్వయం ప్రతిభ కలవాడు కావటంతో మెట్రిక్యులేషన్ పరీక్ష పాసవగలిగారు. బ్రతకటం కోసం గుమాస్తాగా పనిచేశారు. బడిపంతులైతే బ్రతుకు బాగుంటుందని భావించి, ఐదు రూపాయల అదనపు జీతం కోసం కొండల మధ్య, మలేరియా వంటి విషజ్వరాలకు నిలయమైన పర్లాకిమిడిలో టీచర్‌గా చేరారు.

ఆ నిర్ణయమే ఆయన జీవితాన్ని మార్చివేసింది. కొండకోనల్లోని గిరిజనులు, వారి భాష గిడుగును ఆకట్టుకున్నాయి. సవరజాతితో పరిచయం పెరిగింది. వారి భాషకు గిడుగువారు చేసిన సేవ మరువలేనిది. ఆయన భాషా సేప మిగిలిన భాషావేత్తల సేవ కన్నా భిన్నమైనది. ధనం, ప్రతిష్ట పదవి, హోదాలను ఆశిం చని నిర్మల, నిస్వార్థ సేవ గిడుగువారిది.

తాను పర్లాకిమిడి రాజుకు ఆప్తుడు. విజయనగరం రాజులు గిడుగును ఆదరించారు. ఐతే మాటమీద, వ్యవహారాల్లో పట్టుదల వస్తే సహించటం గిడుగుకు అలవాటు లేదు. తన పద్ధతిని కాదన్నందుకు విజయ నగరం సంస్థానంలో యువరాజులకు పాఠాలు చెప్పే అవకాశం వదిలేశారు ఆయన.

పర్లాకిమిడిని ఒరిస్సాలో కలుపుతానని అక్కడి రాజు అంటే అది తప్పని వాదించి, ఉద్యమించారు. గ్రాంథిక భాషనే కొనసాగించాలన్న పండితులను కాదని ఒంటరి పోరాటం చేసి ప్రజల భాషలో 'ప్రజల ఉద్యమం' నిర్వహించారు. భాషా ఉద్యమకారులంతా తొలిగా స్మరించుకోవలసినంత ఎత్తుకు ఎదిగిన వాడు గిడుగు రామ్మూర్తి పంతులు.

తెలుగు భాషమీద విశేష అభిమానం కలిగిన గిడుగు రామ్మూర్తి పంతులు తాను అర్ధశతాబ్దం పైగా నివసించి, పరిశోధనలు చేసి, ప్రపంచానికి వ్యవహార భాష అవశ్యకతను తెలియ చెప్పిన నేలను ఒరిస్సా రాష్ట్రంలో కలపాలి అన్న పర్లాకిమిడి రాజా నిర్ణయం అంగీకరించలేక పోయారు.

తనను ఎంతో ఆదరించిన రాజు అయినా భాష విషయంలో ఆయనతో ఢీకొన్నారు గిడుగు. పర్లా కిమిడీ తెలుగు ప్రాంతమేనని నిరూపించేందుకు తాను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.

కానీ నాటి బ్రిటీష్ పాలకులకు తెలుగువారి మీద కోపం. సైమన్ కమిషన్న ఎదిరించిన తెలుగువారికి - తగిన బుద్ధి చెప్పాలనుకున్నారు. బ్రిటీష్ కమిషన్ తో చేయి కలిపితే తెలుగు రాష్ట్రం ఇస్తామన్నారు.

కానీ దేనికీ లొంగని తెలుగు జాతి భాషా రాష్ట్రం - కోల్పోయింది. అన్నింటికి అంగీకరించిన ఒరియావారు ఒరిస్సా రాష్ట్రం సాధించుకున్నారు. తనమాట నెగ్గని చోట ఎందుకనుకున్నారో ఏమోకాని గిడుగు వారు ఏప్రిల్ 1, 1936న పర్లాకిమిడి వదిలి రాజమహేంద్రవరానికి బయలుదేరారు.

ఇక అక్కడినుండి చివరి రోజులన్నీ అచ్చ తెలుగు ప్రాంతంలోనే గడిచింది. గిడుగువారికి అప్పటికే బండ చెముడు. ఏమీ వినిపించేది కాదు. తన చెవిలో మాట్లా : డేందుకు వీలుగా ఆయన రూపొందించుకున్న గొట్టం, గరాటు వంటిది వాడినా వినటం కుదిరేది కాదు.

అలాగని ఆయనతో సాహిత్య చర్చలు ఆపటం సాహితీ మిత్రులకు ఇష్టం ఉండేది కాదు. ఎవరెవరో వచ్చేవారు. శ్రీపాదవారు, భమిడిపాటి కామేశ్వరరావు, చింతా దీక్షితులు అంతా ఆయన్ను కలుస్తుండేవారు. పలకా, బలపాన్ని గిడుగు ఆశ్రయించాల్సి వచ్చింది.

తనకోసం వచ్చిన వారికి ఆ పలక, బలపం ఇచ్చి రాయమనేవారు. అవి చదివి సమాధానం ఇచ్చేవారు. ఇక ఇంట్లో భార్య, కోడలుతో హావభావాలతో, చేతి సంజ్ఞలతో మాట్లాడటానికి అలవాటు పడ్డారు.

ఆ ఇంట్లో ఎవరిదైనా గొంతు బిగ్గరగా వినిపిస్తే గిడుగు వారిని చూసేందుకు ప్రముఖుడు ఎవరో వచ్చి నట్టు లెక్క అన్నట్టుగా ఉండేది అక్కడి వాతావరణం. గిడుగు కొడుకు రాజమండ్రిలో టీచర్.

తండ్రికి సౌకర్యం కల్పించేందుకు విశాలమైన వాటాలోకి మకాం మార్చి మేడమీద గాలి, వెలుతురు అందే గదిలో వసతి ఏర్పాటుచేశారు.

భోజనం వేళకి కిందికి రావటం తిరిగి మేడమీద - గదికి చేరటం. మనుమలతో కాలక్షేపం కూడా వినికిడి సమస్యతో తగ్గింది. మనుమలకు అప్పుడప్పుడూ తనదైన శైలిలో చదువు చెప్పేవారు.

మనుమలతో కలిసి గోదావరి స్నానం చేసి రావటం దినచర్యలో భాగం చేసుకున్నారు గిడుగు.

పర్లాకిమిడిలో గిడుగు చేసిన తెలుగు ఉద్యమ ఫలితం అక్కడే ఉన్న ఆయన మరో కొడుకు మీద పడింది. గిడుగు చేసిన అప్పుల తాలూకు ప్రామిసరి నోట్లు చూపి కొడుకును తీర్చమని వేధిస్తున్నారని తెలిసి అక్కడి తన భూములను అమ్మి అప్పులు తీర్చమని చెప్పి పర్లాకిమిడితో తన బంధాన్ని శాశ్వ తంగా తెగతెంపులు చేసుకున్నారు.

అంత చేసినా పర్లాకిమిడి రాజావారి కాలేజీలో గిడుగు కొడుకు ఉద్యోగం నిలవలేదు. చివరికి కొడుకు గిడుగు సీతాపతి చెన్నపట్నం చేరి సినిమా రంగంలో వేరేపని చూసుకోవాల్సి వచ్చింది.

1939లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ గిడుగును కళా ప్రపూర్ణతో సత్కరించింది. అప్పటికే ఆరోగ్యం తగ్గింది. చేతి కర్రతో నడవాల్సి వస్తున్నది. వేస్తున్న ప్రతి అడుగుకు మూలుగు తోడయింది.

కడుపులో ఏదో గుల్మం ఉన్నట్టుగా బాధపడుతు న్నానని తరచుగా ఇంట్లో వాళ్ళతో అంటుండేవారు. మీదపడిన వయసు, ఇతర అలవాట్లు కలిసి ఆరో గ్యాన్ని దెబ్బ తీయడంతో మెరుగైన చికిత్సకోసం చెన్నపట్నం తీసుకువెళ్ళారు. మధ్యలో ఒక్క రోజు బాపట్లలో మకాం... అంతే.

కొడుకుమీద కొంత గుర్రుగా ఉండడంతో గిడుగు అతని ఇంటికి నేరుగా వెళ్ళలేదు. కొడుకుతో ముభావంగా ఉండేవారు. ఆ కోపం తగ్గటానికి కొంత సమయం పట్టింది. కొంతకాలం తన అభిమాని అయిన పచ్చయప్ప కాలేజీ తెలుగు ప్రొఫెసర్ ఇంట్లో ఉన్నప్పటికీ చివరికి గిడుగు రాయపేటలో ఉన్న సీతా పతి ఇంటికి వెళ్ళారు. అప్పటికే కదలలేని పరిస్థితి.

అయినా సాంప్రదాయంగా తన తండ్రి ఆబ్దికం పెట్టాలన్న పట్టుదలతో కూర్చుని ఆ తతంగం కానిచ్చి ఇక ఇదే ఆఖరి తద్దినం అన్నారట.

భర్త ధోరణి చూసి కంటనీరు పెట్టుకున్న భార్యను పిలిచి వయసులో పెద్దవారు ముందుపోవటం సహజం. బాధపడాల్సినదేమీ లేదు అంటూ ధైర్యం చెప్పారు. ఇదంతా ఆయన మరణానికి రెండు ఆ మూడు రోజుల ముందు జరిగినది.

ఇక నేను చదువుచెప్పేది లేదు. నీవే బుద్ధిగా చదువుకోవాలని మనుమడికి చెప్పారు. ఇలా కుటుంబ సభ్యులు అందరికి చెప్పాల్సిన మాటలు చెప్పిన గిడుగు రామ్మూర్తి పంతులు 1940 జనవరి 22 వేకువ జామున స్పృహ కోల్పోయారు.

అదే వారి చివరిరోజు అయింది.చికిత్సకోసం చెన్న పట్నం చేరిన నెలరోజుల్లో పే గిడుగు రామ్మూర్తి కాల ధర్మం చేశారు. ఒరిస్సాలో తెలుగు ఉద్యమం చేసిన గిడుగు జీవితం గోదావరి తీరం మీదుగా చెన్నపట్నంలో అంతమైంది. తనకు తాను నిర్మించుకున్న నైతికపరిధి లోనే జీవితం సాగించిన ధన్యుడు గిడుగు. 

Source: స్వాతి సపరివార పత్రిక

Close